వాషింగ్టన్: కోవిడ్ –19 కబంధ హస్తాల్లో చిక్కుకొని అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతుంటే అక్కడ యువతరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. కరోనా పార్టీలు చేసుకుంటూ కోరి మరీ వైరస్‌ను కౌగిలించుకుంటోంది. వాషింగ్టన్‌లో కొన్ని ప్రాంతాల్లోనూ, కెంటకీ, అలబామా, టెక్సాస్ రాష్ట్రాల చుట్టుపక్కల ఈ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులే ఈ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే ఆ విద్యార్థి పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తాడు. ఆ పార్టీకి కరోనా రోగులు, ఆరోగ్యంగా ఉన్నవారు అందరూ వస్తారు.
అక్కడ కరోనా టికెట్లు అమ్మకానికి పెడతారు. ఆ పార్టీలో పాల్గొన్న వారిలో ఎవరికి మొదట వైరస్ సోకితే టికెట్లు అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రైజ్ మనీగా ఇస్తారు. ఇదీ ఇప్పుడు అక్కడ నడుస్తోన్న ప్రమాదకరమైన ట్రెండ్. ‘‘గత కొద్ది వారాలుగా వీకెండ్‌లలో ఎక్కడ చూసినా ఇవే పార్టీలు జరుగుతున్నాయి. మొదట ఇదంతా తప్పుడు వార్తలని అనుకున్నాను. కానీ విచారణ జరిపిస్తే నిజమేనని తేలింది. యువత ఇంత అజ్ఞానంలో ఉన్నందుకు చాలా విచారంగా ఉంది. ఈ పార్టీలుS జరగకుండా చర్యలు మొదలు పెట్టాం’’అని అలబామా ఆరోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ పార్టీలతో కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్ర గవర్నర్ కె ఇవె సెప్టెంబర్ 9 వరకు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు.
ఎందుకీ పైత్యం ? పార్టీకి వెళ్లాడు, ప్రాణాలు కోల్పోయాడు
కోవిడ్–19 పార్టీకి వెళ్లిన టెక్సాస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మెథాడిస్ట్ ఆస్పత్రి వైద్యుడు జేన్ యాపిల్‌బై వెల్లడించారు. కరోనా వైరస్ ఒకసారి వస్తే, రోగనిరోధక వ్యవస్థ పెరుగుతందన్న ఉద్దేశంతో అతను పార్టీకి వెళ్లాడని, వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మృత్యువు ముంచుకొస్తున్న చివరి నిమిషంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని, మరెవరూ అలా చేయొద్దన్న అవగాహన కల్పించాలంటూ ఆస్పత్రి నర్సుకి ఆ వ్యక్తి చెప్పాడని డాక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment