కెనడా వైపు చూస్తున్న అమెరికన్లు!
వాషింగ్టన్: ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అగ్రరాజ్యం అమెరికాకు వలస వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికా ప్రజలు మాత్రం అమెరికా నుంచి పారిపోవడం ఎలా అని ఆలోచిస్తున్నారట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. ఓ వార్తాపత్రిక ఈ అంశంపై మాక్ ట్యుటోరియల్ను సైతం నిర్వహించింది. గూగుల్లో అమెరికన్లు కెనడాకు వెళ్లడం ఎలా అనే అంశాన్ని ఎక్కువగా శోధిస్తున్నారు. మొత్తానికి అమెరికా ప్రజలు కెనడాను సురక్షిత ప్రాంతంగా భావిస్తున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందువరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దేశ దక్షిణ సరిహద్దులోని మెక్సికన్లపై విషం చిమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సరిహద్దులోని కెనడాపై లిబరల్ అమెరికన్ల దృష్టి పడిందని అంటున్నారు విశ్లేషకులు.
దేశంలోకి ముస్లింలను రాకుండా అడ్డుకోవాలని, దేశ దక్షిణ ప్రాంతం మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని, ఇండియాతో సహా పలు దేశాలకు చెందినవారిని వెనక్కి పంపుతానని అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా మొదటి నుంచి శరణార్థుల విషయంలో కఠినవైఖరినే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడా యువ ప్రదాని జస్టిన్ ట్రుడేవ్ సిరియా సహా ఇతర ప్రాంత శరణార్థులను సాదరంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ట్రుడేవ్ ఉదారవాద విధానాలు ఆకర్షించడంతో పాటు.. శరణార్ధులు ఇతర విషయాల్లో ట్రంప్ అహంకార ధోరణితో విసుగెత్తిన లిబరల్ అమెరికా ప్రజలు కెనడా వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.