మెక్సికో సిటీలో జొకాలో స్క్వేర్ వద్ద సంబరాల్లో ఆమ్లో మద్దతుదారులు. (ఇన్‌సెట్లో) ఆమ్లో)
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి.
ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్‌స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్‌ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు.
వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు.
పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు
ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్‌మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్‌ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment