కోపంతో రెస్టారెంట్లో కొండచిలువను వదిలాడు!
లాస్ ఏంజిల్స్: రెస్టారెంట్లో పుష్టిగా తిన్న ఓ కస్టమర్ అక్కడి సిబ్బందిపై కోపంతో ఓ భారీ కొండచిలువను తీసుకొచ్చి వదిలాడు. దీంతో సిబ్బందితో పాటు అక్కడ ఉన్న కస్టమర్లు రెస్టారెంట్ బయటకు పరుగులు తీశారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన ఈ ఘటనలో ఈ చర్యలకు పాల్పడిన సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హిరోషి మెతోహషి ఓ పెట్ షాప్ నిర్వాహకుడు. అతనికి వివిధ దేశాలకు చెందిన అరుదైన జంతువులంటే ఆసక్తి. మెతోహషి ఇటీవల లాస్ ఏంజిల్స్లోని 'సుశి ఆఫ్ టోక్యో' రెస్టారెంట్కు వెళ్లి భోజనం చేసిన అనంతరం అతిని వద్ద ఉన్న అరుదైన చిన్న పామును అక్కడివారికి చూపిస్తుండగా.. అది మిగతా కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ చర్య మానుకోవాలని హోటల్ సిబ్బంది అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మెతోహషి వెంటనే వెళ్లి.. 13 అడుగుల భారీ ఎల్లో పైథాన్ను తీసుకొచ్చి హోటల్లో వదిలి, అక్కడి సిబ్బందిని నానా బూతులు తిట్టి వెళ్లిపోయాడు.
భారీ పైథాన్ను చూసిన కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న లాస్ ఏంజిల్స్ ఫైర్ సిబ్బంది, జంతు సంరక్షణ అధికారులు.. హోటల్ క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పామును పట్టుకున్నారు. మెతోహషి చర్యపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో పలు అరుదైన జంతువులను అమ్మకానికి పెట్టిన కేసులో మెతోహషి జైలు శిక్ష అనుభవించాడని లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.