యాపిల్ సర్వీసులను నిలిపివేసిన చైనా!
బీజింగ్ః చైనాలో యాపిల్ సంస్థ ఐట్యూన్స్ సినిమాలు, ఐ బుక్స్ సేవలను నిలిపివేసింది. అధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతానికి తమ సేవలు అందుబాటులో ఉండవని సంస్థ వెల్లడించింది. అయితే వినియోగదారులకు తిరిగి సాధ్యమైనంత త్వరలో పుస్తకాలు, ఐ ట్యూన్స్ సినిమాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఆ సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అమెరికా తర్వాత యాపిల్ ఉత్పత్తుల మార్కెట్ కు రెండో స్థానమైన చైనాలో సేవలను నిలిపివేయడానికి కారణం మాత్రం తెలియ రాలేదు.
చైనాలో ఏడునెలల క్రితం ప్రారంభించిన ఐ ట్యూన్స్ సినిమాలు, ఐ బుక్స్ వంటి ప్రత్యేక సేవలను యాపిల్ సంస్థ గతవారం నిలిపివేసింది. ప్రెస్, పబ్లికేషన్, రేడియో, సినిమాతో పాటు టెలివిజన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ తో గతవారం యాపిల్ సేవలను తప్పనిసరిగా నిలిపివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
బ్రాడ్ కాస్ట్, ప్రింట్, ఆన్ లైన్ మీడియాల్లో గట్టి పట్టు బిగించిన బీజింగ్.. చైనాలో గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్లతో సహా విదేశీ వెబ్ సైట్ల యాక్సెస్ ను పరిమితం చేసింది. దీంతో రాజకీయంగా సున్నితమైన, హింసాత్మక, నైతికత లేని విషయాలను దేశం తరచుగా నిరోధిస్తోంది. దీనికితోడు చైనాలో యాపిల్ ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు.. అక్కడి మార్కెట్ అమితంగా విస్తరించి అత్యంత కీలకమైనదిగా మారింది. దీంతో యాపిల్ సేవలు, ధరల అంశాలపై ఇంతకు ముందే చైనా మీడియా అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది.
2014 లో యాపిల్ స్టోర్ లోకి చొరబడిన చైనా మొబైల్ అడ్వర్ టైజింగ్ కంపెనీ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించడం మొదలు పెట్టడంతో సరైన సమయంలో గుర్తించిన యాపిల్ కంపెనీ... తమ స్టోర్స్ నుంచి భారీ స్థాయిలో యాప్స్ ను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం యాపిల్ సంస్థలు చైనా సంస్థలకు పోటీ పడుతుండటంతో దేశీయ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం యాపిల్ సేవలను నిలిపివేసినట్లు అధికారిక పరిశీలనలు సూచిస్తున్నాయి.