ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
లాహోర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. జనాభా లెక్కలు సేకరించే వారిని లక్ష్యంగా చేసుకొని బుధవారం లాహోర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులతో పాటు ఇద్దరు జనాభా లెక్కలు సేకరించే వారు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారని పంజాబ్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ మాలిక్ అహ్మద్ వెల్లడించారు.
ఉగ్రదాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇప్పుడే తెలియరాలేదని ఆయన తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరిఫ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో లాహోర్‌లోని ఓ షాపింగ్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.