కాన్‌బెర్రా : ప్రయాణిలకులు కునుకు తీస్తే ఏం కాదు.. మహా అయితే దిగాల్సిన చోట కాకుండా మరో చోట దిగుతారు. అదే డ్రైవర్ నిద్రపోతే.. ఇంకేమైనా ఉందా.. అందరి ప్రాణాలు గాల్లోకి. ఇలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ నిద్ర పోయింది డ్రైవర్ కాదు పైలెట్. అవును విమానం నడపాల్సిన పైలెట్ కాస్తా వెళ్లి కాక్‌పిట్‌లో ఆదమరిచి నిద్ర పోయాడు. ఆనక తీరిగ్గా లేచి విమానాన్ని ల్యాండ్ చేశాడు. దాంతో ఆ విమానం గమ్యస్థానాన్ని దాటి అదనంగా మరో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా భద్రంగా ల్యాండ్ అయ్యింది. ఈ నెల 8న ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పైపర్ పీఏ-31 ఎయిర్‌క్రాఫ్ట్ దేవన్‌పోర్ట్ నుంచి టాస్మానియాలోని కింగ్ ఐస్‌లాండ్ వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది. అయితే కొంత దూరం ప్రయాణించిన తర్వాత పైలట్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత లేచి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే అప్పటికే ఆ విమానం గమ్యస్థానాన్ని దాటి మరో 50 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించింది. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్‌బీ) తెలిపింది. పైలట్‌ను విచారించి, ఆపరేటింగ్ విధానాలను పరీక్షించిన తర్వాత ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను విడుదల చేస్తామని ఏటీఎస్‌బీ పేర్కొంది. గతేడాది మెల్‌బోర్న్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం కింగ్ ఐస్‌లాండ్ వెళ్లే క్రమంలో క్రాష్ కావడంతో ఐదుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment