జికాను అడ్డుకునే కండోమ్‌లు ఇస్తారట!
రియో డి జెనిరోలో ఈ సంవత్సరం జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రీడాకారులకు జికా వైరస్‌ను అడ్డుకునే కండోమ్‌లు ఇవ్వబోతున్నారట. ఇందుకోసం ప్రపంచంలోనే నెంబర్ 2 కండోమ్ తయారీ కంపెనీ ఆన్సెల్ లిమిటెడ్‌తో ఆస్ట్రేలియా ఔషధ తయారీ కంపెనీ స్టార్‌ఫార్మా హోల్డింగ్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. మొత్తం ఆస్ట్రేలియా అథ్లెట్లు అందరికీ స్టార్ ఫార్మా వాళ్ల వివాజెల్‌తో లూబ్రికేట్ చేసిన డ్యూయల్ ప్రొటెక్షన్ కండోమ్స్ ఇస్తామని చెబుతున్నారు. శృంగారం ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తాము తయారుచేసిన వివాజెల్ ఈ వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుందని స్టార్ ఫార్మా సీఈవో జాకీ ఫైర్లీ తెలిపారు.
ఇప్పటికే ఒలింపిక్ గ్రామానికి కొన్ని కండోమ్‌లను పంపామని, వీటితోపాటు ఇప్పుడు కొత్తవాటిని కూడా పంపుతామని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ తెలిపింది. వీటితోపాటు ఒలింపిక్ గ్రామంలో కొన్ని కండోమ్ డిస్పెన్సింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిద్వారా 3.50 లక్షల పురుషుల కండోమ్‌లు, లక్ష మహిళల కండోమ్‌లు అథ్లెట్లకు ఉచితంగా అందిస్తారు. రియో నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించాలన్న నిబంధనలు ఉన్నట్లు వచ్చిన కథనాలను ఏఓసీ ఖండించింది.