
పసివాడిపై ఆ సింహానికి అంతకోపమెందుకొచ్చిందో..!
మనకు తెలియకుండానే మన వెనుకాలే ఎవరో గుట్టుచప్పుడు కాకుండా అడుగులు వేస్తున్నారంటేనే కొంత గుండెల్లో వణుకు పుడుతుంది.
టోక్యో: మనకు తెలియకుండానే మన వెనుకాలే ఎవరో గుట్టుచప్పుడు కాకుండా అడుగులు వేస్తున్నారంటేనే కొంత గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటిది ఒక సింహం అడుగులేస్తే.. అది కూడా తొలుత నెమ్మది ఆ తర్వాత రాకెట్ వేగంగా అమాంతం మీదపడ్డట్లుగా. ఒక బుల్లి బాలుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే, ఆ సింహం వస్తుందన్న ఆలోచన ఆ బాలుడికి లేదు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదు.. ఆ సింహం వచ్చి మీద పడలేదు. ఎందుకంటే ఆ సింహానికి బాలుడికి మధ్య ఓ బలమైన గాజుఫలకమే అతడికి శ్రీరామ రక్షలాగా నిల్చుంది. లేదంటే ఆ భారీ సింగానికి అతడు కోడిపిల్లమాదిరిగా నలిగిపోయేవాడు.
ఈ ఘటన జపాన్లోని చిబా అనే ఓ జూలో చోటు చేసుకుంది. సీసీకెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాన్ని చూసి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. సీసీటీవీలో రికార్డయిన ప్రకారం ఓ రెండేళ్లబాలుడు ఓ సింహాన్ని గాజు ఫలకం ఎన్ క్లోజర్ నుంచి తీక్షణగా చూశాడు. ఆ సమయంలో సింహం కూడా ఎంతో వినమ్రంగా వెనక్కి అడుగులు వేసి రెండు కాళ్లు ముందుకు చాపి ఓ పదడుగుల దూరంలో బుద్ధిగా కూర్చుంది. కానీ, దాని చూపు చూస్తే మాత్రం దాడికి సిద్ధమయిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
అలా సింహాన్ని చూసిన బాలుడు వెనక్కి తిరిగాడో లేదో క్షణం కూడా ఆలస్యం చేయని ఆ సింహం అమాంతం లంఘించి ఆ బాలుడిపైకి వచ్చి మధ్యలో ఉన్న గాజు ఫలకాలనికి బలంగా తగిలింది. ఆ వెంటనే బాలుడిని అందుకోవాలన్న ఆక్రోశంతో పదేపదే గాజు ఫలకాన్ని తట్టింది. ఆ సమయంలో ఓసారి వెనక్కి తిరిగి చూసిన బాలుడు అదిరిపడ్డాడు. ఇలా అక్కడ గాజు ఫలకం ఉందనే విషయ కూడా మరిచి ఆశపడిన సింహం వ్యూహం బెడిసికొట్టింది.