
సింహగీత...
సింహం బొమ్మలు వేస్తుందా? ఈ సింహం వేస్తుంది. జపాన్‌లో ‘సీ లయన్’ల చేత ఫీట్లు చేయించడం, ప్రదర్శనకు పెట్టడం ఆనవాయితీ.
న్యూ ఇయర్
సింహం బొమ్మలు వేస్తుందా? ఈ సింహం వేస్తుంది. జపాన్‌లో ‘సీ లయన్’ల చేత ఫీట్లు చేయించడం, ప్రదర్శనకు పెట్టడం ఆనవాయితీ. పెంపుడు స్వభావం గల ఈ క్షీరదం కొద్దిపాటి శిక్షణతో భిన్న విన్యాసాలు చేయగలదు. 2017 సంవత్సరం రానుంది. జపాన్ వారి చాంద్రమానం ప్రకారం వారికి అది ‘కుక్కుట’నామ సంవత్సరమట. అంటే ‘కోడిపుంజు నామ సంవత్సరం’. ఆ సందర్భంగా జపాన్‌లోని యొకహామా ఆక్వేరియం (ప్రదర్శనశాల)లో సీ లయన్‌తో జపనీస్ భాషలో ‘కోడిపుంజు’ మాటలోని అక్షరాన్ని పేపర్ మీద రాయించారు. అది రాసింది కూడా. చూసేవాళ్లు ఇంత తెలివా అని ఆశ్చర్యపోయారు. సీ లయన్‌లు భారీ నీటి జంతువులు. ఒక్కోటీ దాదాపు 1000 కిలోల బరువు ఉంటుంది. 10 అడుగుల పొడవు ఉంటుంది. వీటికి తిండి పిచ్చి. ప్రతి తడవకు దాదాపు 15 కిలోల ఆహారాన్ని గుటుక్కుమనిపిస్తాయి.
అలాస్కా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీరాల్లో వీటి ఉనికి ఎక్కువ. అయితే అన్నీ జీవాల లానే వీటి సంఖ్య కూడా పడిపోతోంది. సీ లయన్స్ ‘పొలాక్’ అనే జాతి చేపలను తిని జీవిస్తాయి. అయితే చేపల వేటగాళ్లు ఇవే పొలాక్‌లను విస్తారంగా పట్టడం వల్ల సీ లయన్స్‌కు ఆహారం లేకుండా పోతోంది. మనుషులు గోల చేసి ఒత్తిడి పెంచినా, అంతరాయం కలిగించినా సీ లయన్స్ తాము ఉన్న తావును మార్చుకొని దూరం వెళ్లిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రస్తుతం వీటిని చూడడం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. అతిథులను చూడగానే మగ సీ లయన్ పెద్దగా వేసే ఊళ విని ఆనందించవచ్చట.