
రికార్డు బద్దలు కొట్టిన ‘బిగ్ డిబేట్’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్–హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన తొలి ముఖాముఖి చర్చ రికార్డు బద్దలు కొట్టింది. అమెరికా టీవీ చరిత్రలో 36 ఏళ్ల కిందటి రికార్డును మంగళవారం జరిగిన ట్రంప్–హిల్లరీ తొలి చర్చ అధిగమించింది. రికార్డు స్థాయిలో 8.4 కోట్ల మంది చర్చను వీక్షించారు. 1980లో జిమ్మి కార్టర్–రొనాల్డ్ రీగన్ మధ్య జరిగిన చర్చను 8 కోట్ల మిలియన్ల మంది చూశారు. ప్రస్తుత హిల్లరీ–ట్రంప్ చర్చలో 13 ప్రధాన టీవీ ఛానల్ల వీక్షకులనే లెక్కలోకి తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌లో చూసిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
హ్యాంప్‌స్టెడ్‌లోని హాఫ్‌స్ట్రా వర్సిటీలో జరిగిన ఈ 98 నిమిషాల చర్చను వీక్షకులు కదలకుండా చూశారని నిల్సన్ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ. ‘తొలి చర్చ టెలివిజన్ చరిత్రలో రికార్డు బద్దలుకొడుతుందని నాకు తెలుసు. భారీగా ఊపిరి తీసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు మాట్లాడా’ అని చెప్పారు. కాగా, మరో రెండుసార్లు అక్టోబర్ 9, 19 తేదీల్లో ట్రంప్–హిల్లరీ మధ్య చర్చ జరగనుంది. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.