
హోరా హోరీగా ట్రంప్, హిల్లరీ బిగ్ డిబేట్..
లాస్ వేగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన మూడో, చివరి డిబేట్ పరస్పర ఆరోపణలతో యూనివర్సిటీ ఆఫ్ నెవెడాలో వాడీవేడిగా సాగింది. ఒకరిని ఒకరు కరచాలనం చేసుకోకుండానే డిబేట్ ప్రారంభించారు.
మూడో బిగ్ డిబేట్లో సుప్రీం కోర్టు, అబార్షన్, ఇమిగ్రేషన్, ఎకానమీ, ఫిట్నెస్ టు బి ప్రెసిడెంట్, ఫారిన్ హాట్ స్పాట్స్, ది నేషనల్ డెబ్ట్, డెబ్ట్ ఎంటైటిల్ మెంట్ అంశాలపై చర్చ సాగింది. సుప్రీం కోర్టు ప్రజల పక్షాన ఉండాలి, కంపెనీల వైపు కాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. గన్ కల్చర్ మన సంస్కృతిలో భాగమేనని ట్రంప్ అన్నారు. తుపాకులపై నియంత్రణ ఉండాలని హిల్లరీ తెలిపారు.
వలసలపై హిల్లరీ విధానం దారుణంగా ఉందని ట్రంప్ మండిపడ్డారు. దేశంలోకి డ్రగ్స్ వెల్లువలా వస్తున్నాయి, మనకు పటిష్టమైన సరిహద్దులుండాలని ట్రంప్ పేర్కొన్నారు. ఒబామా కొన్ని లక్షల మందిని దేశం నుంచి పంపేశారు, దాని గురించి హిల్లరీ ఎందుకు మాట్లాడదన్నారు.
రెండో రాజ్యాంగ సవరణకు తాను మద్దతిస్తున్నాని హిల్లరీ తెలిపారు. హిల్లరీవి మాటలు తప్ప చేతలు ఉండవని ట్రంప్ అన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్గా హిల్లరీ ఉన్న సమయంలోనే 6బిలియన్ డాలర్లు ఎక్కడికి తరలించారో చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. మహిళలకు తాను ఇచ్చినంత గౌరవం ఎవరూ ఇవ్వరు అని ట్రంప్ అనడంతో ఆడియన్స్ విరగబడి నవ్వగా, సంధానకర్త నిశబ్దంగా ఉండాలని సూచించారు.
చైనా, వియత్నాం నుంచి ఉత్పత్తులు వెల్లువలా వస్తున్నాయని ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే.. చైనా కంపెనీలు వద్దని ట్రంప్ అంటున్నారు. కానీ, లాస్ వెగాస్లోని హోటల్ను చైనా స్టీల్తో నిర్మించారని హిల్లరీ ధ్వజమెత్తారు. అమెరికా ప్రభుత్వ మెయిల్స్ను రష్యా హ్యాక్ చేస్తోందని, వికీలీక్స్ వెనకు రష్యా ఉందని హిల్లరీ ఆరోపించారు. ప్రతిదానికి హిల్లరీ రష్యాను బూచిగా చూపిస్తున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. శ్వేత సౌధంలో కీలు బొమ్మ ఉండాలని పుతిన్ భావిస్తోన్నారని హిల్లరీ అన్నారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా అమెరికా, రష్యా కలిసుండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి వస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని హిల్లరీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు ఊతమిస్తామన్నారు. 30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నారు...ఇప్పటి వరకు మీరేం చేశారని ట్రంప్ మండిపడ్డారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పిస్తామని ట్రంప్ తెలిపారు.