బంధాలు దూరం.. అంతా వాట్సాప్‌లోనే ... | Border Issue WhatsApp group unites divided Families | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌.. ఓ వాట్సాప్‌ గ్రూప్ కథ

Published Thu, Aug 31 2017 2:07 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

బంధాలు దూరం.. అంతా వాట్సాప్‌లోనే ...

బంధాలు దూరం.. అంతా వాట్సాప్‌లోనే ...

సాక్షి, శ్రీనగర్‌: లడక్‌ లోని తుర్‌తుక్‌ గ్రామం.. 43 ఏళ్ల గులాం హుస్సేన్‌ అనే సామాజిక కార్యకర్తకు శనివారం తన సోదరి నర్గీస్‌ దగ్గరి నుంచి ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. అందులో తనకు పుట్టిన బిడ్డ ఫోటోలను ఆమె వాట్సాప్‌లోనే పంపంగా, గులాం వాయిస్‌ మెసేజ్‌లో ఆశీర్వదించాడు. అయితే ఆ సంభాషణల్లోని(సందేశాలు) భావోద్వేగాల తాలుకు లోతు మాత్రం వేరేలా ఉంది.  కారణం తాము భవిష్యత్తులో కలుస్తామో లేదో అన్న భయం వారిలో నెలకొనటమే. 
 
నర్గీస్‌-హుస్సేన్‌ కుటుంబాలు సరిహద్దు వివాదంతో నాలుగు దశాబ్దాల క్రితమే విడిపోయారు. 1971 యుధ్ద సమయంలో నాలుగు గ్రామాలు నియంత్రణ రేఖ వెంబడి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడి అటు-ఇటు విడిపోయాయి. అందులో తుర్‌తుక్‌తోపాటు ప్రస్తుతం నర్గీస్‌ నివసిస్తున్న స్కర్దు  ప్రాంతం(గిల్‌గిట్‌-బల్‌టిస్థాన్‌) ఉన్నాయి. అప్పటి నుంచి ఒకరి కుటుంబాలు ఒకరి ముఖం చూసుకోలేదు. 1989 లో హజ్‌ యాత్ర సందర్భంగా తన తండ్రి సోదరుడు అబ్దుల్‌ ఖదీర్‌ ను కలుసుకుని రోదించిన విషయాన్ని ఈ సందర్భంగా హుస్సేన్‌ గుర్తు చేసుకుంటున్నాడు. ఇలా వీరి ఒక్క కుటుంబమే కాదు. సుమారు 15000 కుటుంబాలు లడక్‌  వద్ద ఏర్పడ్డ కంచె మూలంగా ఏళ్ల తరబడి ముఖాలు చూసుకోకుండా ఉండిపోయారు. 
 
నిత్యం వేల సంఖ్యలు సైన్యం పహారా కాస్తుంటుంది. వీరుంటున్న ఉళ్ల మధ్య ఫోన్‌కాల్స్ కనెక్ట్ కావు, రహదారులు మూసేసి ఉంటాయి. చివరకు వీసాలు కూడా తిరస్కరణకు గురవుతూ వస్తున్నాయి. కానీ, వాట్సాప్‌ పుణ్యమాని తమలాంటి ఎన్నో కుటుంబాలు తిరిగి దగ్గరవుతున్నాయని హుస్సేన్‌ చెబుతున్నారు. ‘ కంచె వేరు అయిన మేం ప్రతీరోజు కలుసుకుంటూనే ఉంటున్నాం. వాట్సాప్‌లో ఆడియో, వీడియో, ఫోటోల రూపంలో సందేశాలను పంపుకుంటున్నాం.  త్వరలో మేం మళ్లీ కలుస్తామన్న ఆశ ఉంది’ అంటూ హుస్సేన్‌ చెబుతున్నారు. ఇక వీరిలో చాలా మట్టుకు ప్రజలు హమ్‌ సబ్‌ కబ్‌ మిలేంగే? పేరుతో ఓ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని అందులో సంభాషించుకుంటున్నారని ముసా చులుంకా అనే పాక్‌ పాత్రికేయుడు తెలిపారు. ఇంట్లో జరిగే శుభకార్యల దగ్గరి నుంచి చావు వార్త దాకా ఇలా ప్రతీ విషయాన్ని సందేశాల రూపంలో తెలియజేసుకుంటున్నారు.
 
సరిహద్దులు మమల్ని వేరే చేసినా సోషల్‌ మీడియా మాత్రం మమల్ని మళ్లీ కలుపుతోందంటూ ఆ గ్రూప్‌లోని వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే శాశ్వతంగా కలిసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? అనే ఎదురు చూస్తున్నామని వారంటున్నారు. మరోపక్క ప్రభుత్వాలు కూడా వీళ్లు మళ్లీ కలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మధ్యే పీపుల్స్ ఫోరం ఆఫ్‌ డివైడెడ్‌ ఫ్యామిలీస్ అండ్ పీస్‌ అనే సంస్థ జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసి ఈ అంశంలో చొరవచూపాలని విజ్ఞప్తి చేయగా, ఆమె సానుకూలంగా స్పందించారు కూడా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement