ఫాస్ట్ ఫుడ్‌లా... ఫాస్ట్ బ్రిడ్జి
త్రీడీతో రెడీమేడ్!
చెట్టులెక్కగలవా? ఓ నరహరి... పుట్టలెక్కగలవా? అని చెంచులక్ష్మి సినిమాలో ఓ పాటుంది. నారాయణుడి ‘స్కిల్స్’ తెలుసుకునేందుకు లక్ష్మీదేవి సంధించిన ప్రశ్నలన్నింటికీ ఆయన ‘ఓ ఎస్’ అని సమాధానం చెప్పేశాడు. అవే ప్రశ్నలను మీరిప్పుడు రోబోలకు వేశారనుకోండి... అవి కూడా లేటెస్ట్ భగవంతుడి టైప్‌లో యా... వీ క్యాన్! అనేయడం ఖాయం. ఫొటోలో కనిపిస్తోందే.. టెక్నాలజీ.. రోబోలు తమ స్కిల్‌సెట్‌కు చేర్చుకున్న సరికొత్త అంశం!
ఎంఎక్స్3డీ అనే నెదర్లాండ్స్ కంపెనీ ఒకటి రోబోలు, త్రీడీ ప్రింటింగ్‌లను కలగలిపి.. ఏకంగా బ్రిడ్జీలు కట్టేస్తామని అంటోంది. అనడమే కాదు, ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరం మధ్యలో ఉన్న కాలువపై ఓ ఉక్కు వంతెనను నిర్మించబోతోంది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకూ ఏవో చిన్న చిన్న వస్తువులను మాత్రమే తయారు చేసుకోవచ్చునని అనుకునే వారు.
ఇటీవలి కాలంలో ఈ భావన తారుమారు అవుతోంది. గోడలు కట్టేందుకు మొదలుకొని.. పూర్తిస్థాయిలో ఓ ఇంటిని కట్టేసేందుకు కూడా త్రీడీ ప్రింటింగ్‌ను వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి బ్రిడ్జీ విషయాన్నే తీసుకుంటే ఇందుకోసం ఎంఎక్స్3డీ ఫ్యాక్టరీ రోబోలను ఉపయోగించింది. కాకపోతే వీటికి త్రీడీ ప్రింటింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్, ఇతర పరికరాలను జోడించింది.
ఒకవైపు నుంచి ఉక్కు, తదితర లోహాలు తీగల రూపంలో రోబో చేతికి వస్తూంటే... అక్కడికక్కడే వాటిని కరిగించి రెడీమేడ్‌గా నిర్దిష్ట రూపంలోకి మారుస్తూంటాయి ఈ రోబోలు. అవసరమైన చోట వెల్డింగ్ కూడా జరిగిపోతూంటుంది. త్రీడీ ప్రింటింగ్ కారణంగా నిర్మాణ ఖర్చు చెప్పుకోదగ్గస్థాయిలో తగ్గుతుందని, అదే సమయంలో లేబర్ ఖర్చులు కూడా పెద్దగా ఉండవని ఎంఎక్స్3డీ అంటోంది.