తూచ్ అన్న బెల్జియం మీడియా..
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్లో బాంబు దాడులకు కారణమైన కీలక ఉగ్రవాదిని మరో ఇద్దరు అనుమానిత ఆత్మహుతి దాడి సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బెల్జియం మీడియా ప్రకటించింది. ఆ వెంటనే తన సమాచారాన్ని వెనక్కి తీసుకుంది. తొలుత వారికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని మీడియా స్పష్టం చేసింది. వీరంతా పారిస్ దాడులకు పాల్పడినవారితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారేనంటూ తెలిపింది.
ఎయిర్ పోర్ట్ లోని సీసీటీవీ ఫుటేజీలో చూపించిన ప్రకారం నజీమ్ లాచ్రౌయి(25) అనే వ్యక్తి ట్రాలీలో బ్యాగులతో వెళుతూ కనిపించాడని, అనంతరం కాసేపటికే ఎయిర్ పోర్టు బయటకు పరుగులు తీశాడని తెలిపింది. అండర్లెక్ట్ అనే ప్రాంతంలో అతడిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారని వెల్లడించింది. అయితే, మరికాసేపటికే మాటమార్చి అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఉగ్రవాది నజీమ్ కాదని తెలిపింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదు. బెల్జియం రాజధాని బ్రసల్స్‌లో తీవ్రవాదులిద్దరూ ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 30మందికి పైగా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.