బీజింగ్: ప్రతిష్టాత్మక చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. పార్టీ 19వ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. కీలక అంతర్గత, అంతర్జాతీయ అంశాలపై దేశ, పార్టీ విధానాలను సమావేశాలకు హాజరైన దాదాపు 2 వేల మంది ప్రతినిధులకు వివరించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, అన్ని సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రక్రియలో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పణంగా పెట్టబోమని తేల్చిచెప్పారు.
డోక్లాం వివాదం నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా సైన్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తామని, తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించబోమని, అవినీతిపై ఉక్కుపాదం కొనసాగుతుందని, విస్తరణవాదం ద్వారా అభివృద్ధి సాధించాలనే విధానానికి చైనా వ్యతిరేకమని.. ఇలా పలు ముఖ్యమైన అంశాలపై దేశ విధానాలను స్పష్టీకరించారు. చరిత్రాత్మక తియనన్మెన్ స్క్వేర్ పక్కనే ఉన్న గ్రేట్ హాల్‌లో వారం రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలతో పార్టీ లో, ప్రభుత్వంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా షి జిన్‌పింగ్ ముందడుగు వేస్తున్నారు. కీలక అంశాలపై జిన్‌పింగ్ వ్యాఖ్యలు.. ఆయన మాటల్లోనే!
‘పొరుగు’తో పరిష్కారానికి చిత్తశుద్ధితో..
స్నేహం, చిత్తశుద్ధి, పరస్పర ప్రయోజనాలు, సమగ్రత, భాగస్వామ్యం, మితృత్వ విధానాలకు అనుగుణంగా పొరుగుదేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటమే చైనా ఉద్దేశం. చర్చల ద్వారా ప్రస్తుతం నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం. అయితే, మా ప్రయోజనాలు దెబ్బతినే ఏ విషయాన్నీ అంగీకరించం. సవాళ్లను, అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విస్తరణవాదంతో అభివృద్ధి చెందాలనేది మా విధానం కాదు.
ఆర్మీ బలోపేతంపై మిషన్ 2020
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)ను బలోపేతం చేయటం చాలా కీలకం. పీఎల్‌ఏను ప్రపంచస్థాయి శక్తిగా మారుస్తాం. 2020 కల్లా ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఐటీ, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నాం. 2035కల్లా పీఎల్‌ఏను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తాం.
తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించం
స్వతంత్రంగా ఉండేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానీయబోం. చైనా భూభాగం నుంచి ఏ భాగమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా విడిపోయేందుకు ప్రయత్నిస్తే అనుమతించే ప్రసక్తే లేదు. కావాలంటే, హాంకాంగ్, మకావ్‌ల్లో జరుగుతున్నట్లు ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ద్వారా శాంతియుత పద్ధతిలో పాలన కొనసాగించుకునేందుకు అంగీకరిస్తాం. తైవాన్ అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తాం.
బలమైన ఆర్థిక వ్యవస్థగా..
గత ఐదేళ్లలో చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఐదేళ్లలో 12.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన చైనాను అగ్రస్థానంలో నిలిపేలా స్థిర వృద్ధి రేటుతో ముందుకెళ్తున్నాం. సరఫరాలో సంస్కరణల ద్వారా ఆర్థిక నిర్మాణం స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఐదేళ్లలో వ్యవసాయ ఆధునికీకరణలోనూ గణనీయమైన మార్పులు సాధించాం. ప్రపంచ వాణిజ్యానికి చైనా నాయకత్వం వహిస్తోంది. విదేశాల్లో పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఐదేళ్లలో 6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం.
ప్రపంచానికే ‘చైనా’ మోడల్
2020 కల్లా ఆధునిక, సుసంపన్న దేశంగా చైనా ఎదగనుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చైనా మోడల్‌ను అందిపుచ్చుకుంటాయి. దశాబ్దాల నిరంతర శ్రమ ఫలితమే ఇది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక, మిలటరీ, పర్యావరణ అంశాల్లో చైనా ఓ ప్రబలశక్తిగా మారేందుకు సమయం ఆసన్నమైంది.
పార్టీ పునర్‌నిర్మాణం గురించి
సీపీసీని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. చైనా పునరుజ్జీవనం కోసం భారీ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించాలి. సోషలిజంలో సరికొత్త శకాన్ని ఆరంభించటం అత్యంత ఆవశ్యకం. పార్టీని కూడా శక్తివంతంగా తయారుచేయటంలో మనమంతా నిరంతరం శ్రమించాలి. పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అవినీతే. దీనిపై పోరాటం అంత సులువేం కాదు. అయినా తప్పకుండా విజయం సాధిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment