'పాక్తో దోస్తీ అంటే భారత్తో దుష్మనీ కాదు'
బీజింగ్: భారత ప్రాదేశిక జలాల్లోకి తమ జలాంతర్గామి (సబ్మెరైన్) ప్రవేశించడంపై చైనా వివరణ ఇచ్చింది. గత మే నెలలో చైనా జలాంతర్గామి ఒకటి భారత జలాల గుండా కరాచీ పోర్టుకు వెళ్లిన దరిమిలా అనేక సందేహాలు ఉత్పన్నమయిన సంగతి తెలిసిందే. చైనా మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జియాంగ్ బిన్ బుధవారం బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ చైనా జలాంతర్గామి కరాచీకి వెళ్లడం వెనుక భారత్ను కవ్వించడం లాంటి దురుద్దేశమేది తమకు లేదన్నారు.
రెగ్యులర్ ఈవెంట్లో భాగంగానే తమ జలాంతర్గామి కరాచీకి వెళ్లిందని, శ్రీలంక, బంగ్లాదేశ్ తీరాలకు కూడా వెళ్లిందని గుర్తుచేశారు. రక్షణ రంగంలో పాక్- చైనాలు ఎప్పటినుంచో సహకరించుకుంటున్నాయని, ఆ దేశం తమకు సంప్రదాయ స్నేహితుడని జియాంగ్ అన్నారు. పాక్తో దోస్తీ (స్నేహం) వల్ల భారత్తో దుష్మనీ (శత్రుత్వం) తలెత్తే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఇటీవలికాలంలో ఇరు దేశాధినేతల సందర్శనలతో చైనా- భారత్ బంధం మరింత బలపడిందన్నారు. 'పాక్, భారత్ల మధ్య నెలకొన్న సమస్యలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. అందుకు మా (చైనా) సహకారం అవసరమని అవి (భారత్, పాక్ లు) భావిస్తే అప్పుడు తప్పకుండా సహాయం చేస్తాం' అని జియాంగ్ వ్యాఖ్యానించారు.