సంఘటన అనంతరం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అలెక్
'ఒకడు స్వర్గం చూడాలంటే వాడు కచ్చితంగా మరణించాలి' అని బైబిల్ సామెత. ఇలాంటివే తెలుగు సినిమాల్లోనూ వినబడతాయ.. 'గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్' లాంటివి. జననం, మరణం, దైవం, కార్యం కాంబినేషన్లో చెప్పుకోవడానికి బోలెడు డైలాగులున్నాయి మనకు. పాపం ఇలాంటివి ఏ ఒక్కటైనా చెవికి ఎక్కితే అలెక్ క్షేమంగా ఉండేవాడు. ఇంతకీ మనవాడు ఏం చేశాడంటే..
దక్షిణాఫ్రికాకు చెందిన అలెక్ ఎన్ డీవానె క్రైస్తవ మతబోధకుడు. తన ప్రార్థనాశక్తిని నలుగురికీ చూపించుకోవాలనే ఆలోచనతో ఏకంగా సింహంతో ప్రాక్టికల్ చేయబోయాడు. ప్రఖ్యాత కుర్గెర్ సఫారీ పార్కులోకి వెళ్లి.. సింహాలగుంపు ముందు నిల్చొని.. 'దేవుడు నిజంగా శక్తిమంతుడైతే ఈ సింహం నన్నేమీ చెయ్యదు' అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు.
అరుపులకు బెదిరిపోయిన సింహాలు అలెక్ వైపు కోపంగా దూసుకొచ్చాయి. అప్పుడు గానీ పూర్తిగా అర్థంకాలేదు మనోడికి.. 'దైవశక్తిని నమ్మాలే గానీ వాస్తవావాస్తల జోలికి వెళ్లకూడదు' అని! అయితే జ్ఞానోదయం అయినంత ఫాస్ట్ గా కాళ్లు పనిచేయలేకపోవడంతో క్రూరజంతువులకు దొరికిపోయాడు. పరుగుపెట్టే ప్రయత్నంలోఉన్న అతనిపై ఓ సింహం పంజా విసిరింది. అంతే, ఒక్క దెబ్బకు పిరుదుల ప్రాంతం నుంచి అరకేజీ మాంసం ముద్ద ఊడిపడింది. జూ సంరక్షుడు తుపాకి పేల్చకుండా ఉండేదుంటే అలెక్ ప్రాణాలు ఈపాటికి గాల్లో కలిసిపోయి ఉండేవి. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అలెక్.. 'జంతువులపై తనకున్న ఆధిపత్యాన్ని భగవంతుడు నా ద్వారా నిరూపించాలనుకున్నాడు' అని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఓ గాడ్..!