ఆ పండ్లతో కిడ్నీ రాళ్లు కరుగుతాయ్!
కిడ్నీల్లో రాళ్లు రావడం ఈ రోజుల్లో కామన్ అయిపోతోంది.. చాలా చిన్న వయసులో కూడా ఈ బాధ అనుభవించేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి చికిత్స కూడా కాస్త కఠినంగానే ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మారని ఈ చికిత్స పద్ధతికి ప్రత్యామ్నాయం త్వరలోనే రానుంది.
మూత్రపిండాల్లోని రాళ్లను కొన్ని రకాల పండ్లలో ఉండే హైడ్రాక్సీ సిట్రేట్ రసాయనం ఇట్టే కరిగిస్తుందని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాల్షియం ఆక్సలేట్ కారణంగా వచ్చే ఈ కిడ్నీ రాళ్లను రాకుండా నివారించాలంటే నీరు ఎక్కువగా తాగాలని, ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే పాలకూర, టమోటాలు తినొద్దని డాక్టర్లు చెబుతారు. అలాగే పొటాషియం సిట్రేట్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని కూడా చెబుతుంటారు.
కాకపోతే పొటాషియం సిట్రేట్‌తో వచ్చే దుష్ఫలితాలు ఎక్కువ కాబట్టి కిడ్నీ రాళ్ల నివారణకు ప్రత్యామ్నాయం కోసం హ్యూస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయత్నించారు. హైడ్రాక్సీ సిట్రేట్ ఉన్న పండ్లు తీసుకుంటే కిడ్నీ రాళ్లు కరిగిపోయే అవకాశం ఉందని గుర్తించారు. కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్న కొందరిపై ఈ మందును ప్రయోగించగా సత్ఫలితాలు సాధించినట్లు జెఫ్రీ రిమ్మర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇంకా పరిశోధనలు నిర్వహించి మరింత మెరుగైన మందు తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.