కోవిడ్-19(కరోనా) వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్ మాస్క్‌లకు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కొరతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ ట్రక్కు డ్రైవర్‌ను మొరాకోలోని టాంగర్ మెడ్ కార్గో రేవు వద్ద మొరొక్కో అధికారులు అరెస్ట్ చేశారు. బ్రిటన్ నుంచి మొరొక్కో రేవుకు 25 కోట్ల రూపాయలు విలువైన లక్ష ఫేస్ మాస్క్‌లను బ్రిటన్ డ్రైవర్ తీసుకొచ్చారు. ఆ డ్రైవర్ సరకు అన్‌లోడ్ చేయకుండా వాటిని బ్లాక్‌లో విక్రయించేందుకు తిరిగి లండన్‌కు తీసుకెళుతూ కస్టమ్స్ అధికారులకు మంగళవారం సాయంత్రం దొరకిపోయాడు.
ఒక్కో మాస్క్‌ను రెండున్నర వేల రూపాయల చొప్పున విక్రయించాలనుకున్నట్లు మొరాకో పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ వెల్లడించాడు. అయితే ఆ డ్రైవర్ పేరును తెలిపేందుకు మొరాకో అధికారులు నిరాకరించారు. మొరాకోలో సోమవారం నాడు మొదటి కరోనా కేసు బయట పడింది. ప్రస్తుతం ఆయన్ని కాసాబ్లాంక ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ప్రపంచంలో సగం మార్కెట్‌కు ఫేస్ మాస్క్‌లను సరఫరా చేస్తోన్న చైనా కంపెనీల్లోనే పలు కంపెనీలు కరోనా వైరస్ విస్తరణ కారణంగా మూత పడడంతో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్‌ల కొరత ఏర్పడింది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌ల ధరలు అడ్డగోలుగా పెరగి పోయాయి.
ఈ నేపథ్యంలో స్పెయిన్‌లోని పలు సర్జికల్ షాపులు, ఆస్పత్రుల నుంచి మాస్క్‌ల చోరీలు జరగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వల్లాడాలిడ్ యూనివర్శిటీ క్లినిక్ ఆస్పత్రి నుంచి ఐదువేల మాస్క్‌ల చోరీ జరిగినట్లు ప్రాంతీయ వైద్య అధికారులు తెలిపారు. కోస్టా డెల్ సోల్ ఆస్పత్రి స్టోర్ నుంచి 300 మాస్క్‌లు చోరీ అయ్యాయి. ఇదిలావుండగా, థాయ్‌లాండ్ ఉపయోగించి పడేసిన ఫేస్ మాస్క్‌లను తీసుకొచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి అమ్ముతున్న కార్మికులను అరెస్ట్ చేశారు. బ్యాంకాక్‌కు ఉత్తరాన సారాబురి రాష్ట్రంలోని ఓ ఇంట్లో ఆరుగురు కార్మికులు వాషింగ్ మిషిన్లలో మాస్క్‌లు ఉతికి, ఇస్త్రీ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment