కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 186 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్ సోకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది. ఈ క్రమంలో అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. పక్కనున్న శత్రుదేశం అమెరికాను కరోనా పీడిస్తున్న తరుణంలో ఆ దేశానికి వైద్యులను పంపి ఆదుకుంటోంది. యూఎస్‌కే కాదు క్యూబా వైద్యులు నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు సేవలందిస్తున్నారు.
క్యూబా.. ఒక చిన్న దేశం.. మన దేశంలో ఓ జిల్లా అంత విస్తీర్ణంలో ఉంటుంది. కేవలం కోటి మంది జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ జనాభాగల దేశం. కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కరోనా వైద్య సేవల్లో క్యూబన్ డాక్టర్లు నిమగ్నమయ్యారు. కరోనా కారణంగా ఆరోగ్యం అనేది గాలిలో దీపమైపోయిన వేళ.. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో క్యూబా మన కళ్ల ముందు కనిపించే ఓ కాంతి రేఖ.
విప్లవ యోధులైన చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల ప్రభావం అక్కడి యువతరంపై ఎక్కువ. ముఖ్యంగా గొప్ప వైద్యుడు, మానవతావాది అయిన చేగువేరా స్ఫూర్తి క్యూబా డాక్టర్లలో కనిపిస్తుంది. దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమేననేది క్యూబా సోషలిస్టు ప్రభుత్వం నమ్మే సిద్ధాంతం. అందుకే.. ప్రపంచం మొత్తాన్నీ కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ.. క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రపంచానికి క్యూబా ఏం ఇస్తోందో క్యాస్ట్రో చెప్పారు. యుద్ధం చేసి ప్రాణాలు తీసే బాంబులను క్యూబా తయారు చెయ్యబోదన్న క్యాస్ట్రో.. మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తమ దేశం తయారు చేస్తుందన్నారు.
క్యాస్ట్రో చెప్పిన విధంగానే క్యూబా తనను తాను డాక్టర్ల కార్ఖానాగా నిరూపించుకుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా క్యూబా ప్రభుత్వం ఆయా దేశాల సహాయార్థం భారీగా డాక్టర్ల బృందాలను పంపి స్వచ్ఛంద వైద్య సేవల్ని అందిస్తుంది. కరోనా అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తున్న వేళ.. క్యూబా డాక్టర్లు కరోనా బాధిత దేశాలకు సేవలందించేందుకు తరలివెళ్లారు. క్యూబా సోషలిస్టు భావాలంటే అమెరికా భయపడుతుంది. అందుకే.. క్యూబా అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలుంటాయి. క్యూబాను అణగదొక్కేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నాల్లేవు. అలాగే ఇటలీ, బ్రిటన్, జర్మనీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అవేవీ మనసులో పెట్టుకోని క్యూబా కరోనా వైద్య సేవలందించేందుకు తన దేశం నుంచి వైద్య బృందాలను పంపింది. తమ దేశంలోకి క్యూబా వైద్యులు రాగానే ఇటలీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి గొప్ప స్వాగతం పలికారంటే.. అది క్యూబా వైద్యులపై ఇటలీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం.
అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఇలా అనేక దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబన్ వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ రోగాలు ప్రబలిన సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా డాక్టర్లు సైనికుల్లా ముందుకు కదిలారు. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోతోంటే.. క్యూబా డాక్టర్ల బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి సేవలందించాయి. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే క్యూబా డాక్టర్లు కష్టకాలంలో పోరాడే యోధులు.
కరోనా కరాళ నృత్యంతో అమెరికా కకావికలం అయిపోతోంది. ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్, ఇరాన్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయ్. ఈ దేశాలన్నీ సంపన్న దేశాలు. ఆధునిక పోకడలు ఎక్కువగా ఉన్న దేశాలు. కానీ క్యూబా అమెరికాను ఆనుకొని ఉన్న చిన్న దేశం. అమెరికా విద్వేషాన్ని ఎదుర్కొంటూ తన దేశాన్ని తీర్చిదిద్దుకున్న దేశం. ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశం. కరోనా విసిరిన సవాలును దీటుగా స్వీకరించి వైద్యసేవలందిస్తున్న క్యూబా మన లాంటి దేశాల ప్రాధాన్యతలు ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది.
ఆఫ్రికా ఖండం ఎబోలాతో తల్లడిల్లినపుడు అండగా నిలిచింది క్యూబా వైద్యులే. ఇవాళ కరోనాతో అతలాకుతలమవుతున్న వేళ అగ్రరాజ్యాలు చేతులెత్తేసినపుడు మేమున్నామని భరోసా ఇచ్చింది క్యూబా వైద్యులే.. క్యూబాను చూసైనా భారత్ తో సహా అనేక దేశాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయుధాలు, అణ్వస్త్రాల కంటే విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టిసారించాలి. భవిష్యత్తులో యుద్ధాలంటూ చేయాల్సివస్తే అది శతృదేశాలతో కాదనీ.. కరోనా లాంటి భయంకరమైన వైరస్‌లతోనన్న నిజాన్ని గుర్తించాలి. అందుకు దేశపౌరులను సిద్ధం చేసేందుకు వైద్యరంగాన్ని అత్యంత ప్రాధాన్యమైన రంగంగా గుర్తించాలి. ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం పోసే వైద్యాన్ని పటిష్టం చేసుకోవాలంటూ దిశా నిర్దేశం చేస్తోంది క్యూబా.
Comments
Please login to add a commentAdd a comment