ఎన్‌ఎస్జీ సభ్యత్వంపై ప్రతిష్టంభన
తాష్కెంట్/సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వంపై సియోల్‌లో గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక భేటీ ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది. ఈ అంశంపై ఎన్‌ఎస్జీ సభ్య దేశాలు రెండుగా చీలిపోయాయి. చైనాతోపాటు టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రియా, ఐర్లాండ్ కూడా భారత్‌కు సభ్యత్వంపై అభ్యంతరం తెలిపాయి. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు సభ్య దేశంగా ఉన్న బ్రెజిల్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే రెండో రోజు ప్లీనరీలో పరిష్కారం దొరుకుతుందేమోనని భారత్ ఆశాభావంతో ఉంది.
గురువారం ఉదయం ఎన్‌ఎస్జీ ప్లీనరీ ప్రారంభ సదస్సులో జపాన్‌తో పాటు మరి కొన్ని దేశాలు భారత్ అంశాన్ని లేవనెత్తాయి. నాన్-ఎన్‌పీటీ దేశాలకు సభ్యత్వ అంశం ఎజెండాలో లేకపోవడంతో... రాత్రి ప్రత్యేకంగా భేటీ అవ్వాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అంతకుముందు ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్‌కు మద్దతివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు దాదాపు 50 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కోసం భారత విజ్ఞప్తిని నిజాయితీగా, సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పరిశీలించాలని మోదీ కోరారు.
ఇతర అంశాలతో ముడిపెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని, సియోల్ సదస్సులో ఏకాభిప్రాయం వచ్చేందుకు చైనా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్‌ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కీలక భేటీ జరిగింది. చైనా స్పందనపై మాట్లాడేందుకు విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ నిరాకరించారు. ‘ఇది సంక్లిష్ట, సున్నితమైన అంశం... సియోల్ నుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని ఎదురుచూస్తున్నాం’ అని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా చైనా అధ్యక్షుడితో చర్చించారు.
ఎన్‌ఎస్జీ సభ్యత్వం అంశంలో పాక్‌కు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సియోల్ ప్లీనరీపై మోదీ-జిన్‌పింగ్ భేటీ ప్రభావం ఉంటుందని భారత్ ఆశలు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. చైనా మద్దతు కీలకం కావడంతో... ఆ దేశాన్ని ఒప్పిస్తే ఇతర దేశాల అభ్యంతరాలు కూడా తొలగిపోతాయని భావించింది. మొదటి నుంచి చైనా... భారత్‌ను వ్యతిరేకిస్తూనే పాక్‌కు అనుకూలంగా పావులు కదిపింది. సభ్యత్వం పొందాలంటే 48 సభ్య దేశాల ఏకాభిప్రాయం తప్పనిసరి.