కపాలం ఏలియన్‌ది కాదు.. పిల్లవాడిదే!
యుద్ధరంగంలో పోరాడిన ఓ పిల్లవాడికి చెందిన కపాలాన్ని రష్యాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీశారు. క్రిమియాలోని ఓ శ్మశానవాటికలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో వారికి ఓ అస్తిపంజరం కాలి ఎముకలు తగిలాయి.
దాంతో పూర్తిగా అస్ధిపంజరాన్ని వెలికితీసేందుకు సున్నితమైన బ్రష్‌లను ఉపయోగించారు. పూర్తిగా బయటపడిన అస్ధిపంజరాన్ని చూసిన వారు షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం అస్ధిపంజరం తల ఏలియన్ తలను పోలి ఉండటమే.
అయితే, దీనిపై మాట్లాడిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం కపాలం ఏలియన్‌ది కాదని అన్నారు. ఇదొక పిల్లవాడి కపాలమని చెప్పారు. పిల్లవాడి కపాలం అంత పొడవుగా ఎలా మారిందని ప్రశ్నించగా.. 2 వేల సంవత్సరాల క్రితం పిల్లలను యుద్ధానికి పంపేవారని తెలిపారు.
యుద్ధంలో గెలుపు కోసం.. కృత్రిమ పద్ధతుల్లో వారి కపాలాన్ని సాగదీసేవారని వెల్లడించారు. ఈ ప్రక్రియలో భరించరాని బాధను పిల్లలు అనుభవించేవారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శ్మశాన ప్రాంతం గుండా బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించడంతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కపాలం గ్రహాంతరవాసులదేనని కొందరు వాదిస్తున్నారు.