విదేశీయులే టార్గెట్ | Target aliens | Sakshi
Sakshi News home page

విదేశీయులే టార్గెట్

Published Mon, Oct 12 2015 12:55 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

విదేశీయులే టార్గెట్ - Sakshi

విదేశీయులే టార్గెట్

బీపీఓ స్కామ్ నుంచి ‘బ్యాంకు లోన్ల’ వరకు
అడ్డంగా మునిగిపోతున్న పరదేశీయులు
కాల్ సెంటర్ల కేంద్రంగా జరిగినవే ఎక్కువ

 
సిటీబ్యూరో: అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక భారీ సైబర్, క్రెడిట్‌కార్డ్ నేరాలకు ఇక్కడే కీలక లింకులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన బీపీఓ స్కామ్... ఐదేళ్ల క్రితం బయటపడిన ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్... ఆపై 2009లో స్కిమ్మింగ్ గ్యాంగ్... ఇప్పుడు ‘కాల్ సెంటర్ క్రైమ్’... వీటన్నింటిలోనూ నిందితులు ఇక్కడి వారు కాగా... బాధితులు విదేశీయులే ఉన్నారు. వారి సొమ్ముతో ఇక్కడి వారు జల్సాలు చేస్తుంటే... చిల్లు మాత్రం పరదేశీయులకు పడుతోంది.

బీపీఓ స్కామ్...
2006 అక్టోబర్ 5న వెలుగులోకి వచ్చిన బీపీఓ స్కామ్ ఈ తరహా నేరాల్లో తొలిది. నగరంలోని ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్న జావేద్, ముస్తాక్ హుస్సేన్, ఖలీల్ ఇబ్రహీం మహ్మద్, షరీఫ్‌లు లండన్ జాతీయులకు చెందిన వ్యక్తిగత డేటాను విక్రయిస్తామంటూ బయలుదేరారు. లండన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఇవి వెలుగులోకి వచ్చింది. ఒక్కో వ్యక్తి డేటాకు 8 పౌండ్లు చెల్లించే లెక్కన మొత్తం లక్ష మంది లండన్ పౌరుల డేటా కొనుగోలు చేయడానికి వీరితో మీడియా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై అదే ఏడాది అక్టోబర్ 31న సీఐడీలోని సైబర్ క్రైమ్ సెల్‌లో కేసు నమోదైంది.
 
 2008లో ‘క్రెడిట్ కార్డు ఫ్రాడ్’...
ఆన్ లైన్ ద్వారా జరిగిన భారీ స్థాయి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ గుట్టును 2008 జూన్ 12న నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహ్మద్ ముజ్‌తబా అలీ, మహ్మద్ అబ్దుల్ అసీం, షేక్ అజీజ్ అహ్మద్, మహ్మద్ మౌలానా, ఇమ్రాన్ ఈ వ్యవహారానికి తెరలేపారు. నిర్ణయ్ టెక్నాలజీస్ అనే కాల్ సెంటర్ నుంచి అమెరికా దేశస్థుల క్రెడిట్‌కార్డ్ నెంబర్లు, పిన్‌లను సేకరించారు. ఇందుకు అదే సంస్థలో  పని చేసే మౌలానా సహకరించాడు. ఇదే రకంగా మరెందరో కాల్ సెంటర్ ఉద్యోగుల నుంచి దాదాపు 2000 మంది అమెరికన్ల ‘కార్డుల’ వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆన్‌లైన్ ద్వారా ఎందరో విదేశీయుల ఖాతాలకు చిల్లులు పెట్టారు.
 
2009లో స్కిమ్మింగ్ గ్యాంగ్...
చెన్నైకు చెందిన బాలకష్ణన్ సూత్రధారిగా ఉన్న ఈ రాకెట్ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 ఏప్రిల్‌లో రట్టు చేశారు. అమెరికా, లండన్ సహా అనేక దేశాల్లోని  హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో పని చేసే వారిని ఏజెంట్లుగా మార్చుకుని, అక్కడకు వినియోగదారులుగా వచ్చిన వారి క్రెడిట్ కార్డులను స్కిమ్మింగ్ చేయించారు. ఈ డేటాతో బోగస్/క్లోన్డ్ కార్డులను తయారు చేసి దేశ వ్యాప్తంగా ఉన్న ముఠా సభ్యులతో క్యాష్ చేసుకున్నారు.
 
తాజాగా కాల్ సెంటర్ క్రైమ్...
గుజరాత్‌కు చెందిన ఇషాన్, పుణేకు చెందిన బజాజ్‌లు సూత్రధారులు. నగరంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సాగిన కాల్ సెంటర్ క్రైమ్‌ను దక్షిణ మండల పోలీసులు గురువారం ఛేదించారు. బ్యాంకు రుణాల పేరుతో దగా చేసిన ఈ ముఠాల చేతిలో దాదాపు వెయ్యి మందికి పైగా అమెరికా, లండన్‌లకు చెందిన వారు మోసపోయారు. ఇలాంటి ముఠాలు మరికొన్ని ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
బీపీఓ రంగం మనుగడకే ముప్పు: నిపుణులు
ఈ తరహా ఉదంతాల్లో నష్టపోతున్నది విదేశీయులై కావడంతో ఇక్కడ ఫిర్యాదులు ఉండవు. దీంతో వీరు చిక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. వీటిలో అనేక నేరాలో కాల్ సెంటర్ల కేంద్రంగా చోటు చేసుకోవడం ఆ రంగానికి పూడ్చలేని నష్టాన్ని తేవచ్చని సాఫ్ట్‌వేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీయుల డేటా చోరీ వల్ల కాల్ సెంటర్ల భవిత దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడి కాల్ సెంటర్లలో డేటా భద్రంగా ఉండనే అపవాదు మూటకట్టుకుంటే పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపించవని, ఇదే జరిగితే అసలే సంక్షోభంలో ఉన్న బీపీఓ రంగం మరింత మందగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement