
బెంఘాజీ: ఆఫ్రికా దేశమైన లిబియా మంగళవారం వరుస కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. బెంఘాజీ నగరంలోని ఓ మసీదు నుంచి ప్రార్థనల అనంతరం ప్రజలు బయటికొస్తుండగా రెండు శక్తిమంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లలో 87 మంది గాయపడ్డారు.
మొదటి కారు బాంబు పేలిన తర్వాత సహాయక చర్యల కోసం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలే లక్ష్యంగా అరగంట వ్యవధిలో మరో కారు బాంబు పేలిందని అధికారులు తెలిపారు. లిబియా అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన సలాఫీ గ్రూపులకు కేంద్రంగా ఉండటంతోనే ఈ మసీదుపై దాడి జరిగిందన్నారు. ఈ దాడిని తామే చేసినట్లు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదన్నారు. నాటో బలగాలు 2011లో లిబియా పాలకుడు గడాఫీని హతమార్చినప్పటి నుంచి ఆ దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది.