కెనడాకు అలాన్ కుర్దీ కుటుంబం..
టొరంటో: ఇటీవల సిరియా బాలుడి మృతదేహం బీచ్లో పడివున్న ఓ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మూడేళ్ల అలాన్ కుర్దీ అనే బాలుడు నిర్జీవంగా ఇసుకలో పడి ఉండటం పలువురిని తీవ్రంగా కలిచివేసింది. టర్కీ నుండి గ్రీస్కు సముద్రమార్గంలో అక్రమంగా ప్రయాణిస్తున్న సందర్భంగా జరిగిన ప్రమాదంలో అలాన్ కుర్దీతో పాటు అతని సోదరుడు, తల్లి మృతి చెందారు. ఈ ప్రమాదంలో అలాన్ కుర్ది తండ్రి అబ్ధుల్లా మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు.
అక్రమ వలసదారులతో ఓవర్లోడ్తో వెలుతున్న బోట్ మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అలాన్ కుర్దీ ఫోటో సిరియా శరణార్థుల కష్టాలను కళ్లకు కట్టింది. అలాన్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు నీలోఫర్ డెమిర్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ఫొటో తీయడంతో ఈ విషాదం బయటికొచ్చింది. ప్రపంచ దేశాలను కదిలించింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు శరణార్ధులకు సహాయం అందించడానికి ముందుకొచ్చాయి.
అలాన్ కుర్దీ కుటుంబాన్ని కెనడాకు ఆహ్వానించినట్లు కెనడాలో ఉన్న అతని ఆంటీ టిమా కుర్ది తెలిపింది. ఈ క్రిస్మస్ను అలాన్ కుర్దీ తండ్రి అబ్దుల్లాతో పాటు అంకుల్ మహమ్మద్ కుర్దీతో జరుపుకోబోతున్నట్లు ఆమె తెలిపింది. అయితే అతని ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన అడ్డంకులు పూర్తిగా తొలిగిపోలేదని కెనడా అధికారులు చెబుతున్నారు. కానీ అలాన్ కుర్దీ ఫ్యామిలీ కెనడాకు చేరుకోవడానికి ఉన్నటువంటి ప్రాధమిక అడ్డంకులు తొలగిపోయినట్లు ప్రకటించారు. అబ్దుల్లా కుర్దీ శరణార్ధులకు సాయం అందించాలని నిర్ణయించుకున్నాడని, తద్వారా కొంతైనా స్వాంతన పొందాలని కోరుకుంటున్నాడని టిమా కుర్దీ వెల్లడించింది.