వీకెండ్ టూర్ నుంచి తిరిగొస్తూ..
బ్యాంకాక్: ప్రకృతి సౌందర్యాలను చూస్తూ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేశారు. మనసు నిండా ఆనందంతో ఇళ్లకు బయలుదేరారు. అయితే గమ్యం చేరేలోపే అనూహ్యరీతిలో మృత్యువాతపడ్డారు. థాయిలాండ్ లోని కాంచనాబురి ప్రాంతంలో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సహా 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు. స్థానిక మీడియా, పోలీసుల కథనం ప్రకారం..
40 మంది టూరిస్టుల బృందం గత వారం బ్యాంకాక్ నుంచి ప్రఖ్యాత శ్రీనగరింద్ డ్యామ్ పరిసర ప్రాంతానికి పర్యటనకు వెళ్లారు. టూర్ ముగించుకుని ఆదివారం తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మలుపుల ఘాట్ రోడ్డులో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా కొండను ఢీకొట్టడంతో ముందు భాగమంతా నుజ్జునుజ్జయింది. దీంతో మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. సంఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారిపై అవగాహన లేనందునే డ్రైవర్ పొరపాటు చేసిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.