ఐకమత్యమే కాపాడింది!
ఐకమత్యమే మహా బలము అనే సామెత మనకు తెలిసిందే. సౌతాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో జరిగిన ఘటన ఇప్పుడా ఆ సామెతను నిజం చేస్తోంది. కలిసి పనిచేయగలగడం (టీమ్ వర్క్) సత్ఫలితాలనిస్తుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. పార్క్ లో సుమారు రెండు, మూడు నెలల వయసున్న ఏనుగు పిల్ల బురద మట్టిలో ఇరుక్కుంది. చిన్న వయసు కావడంతో ఎంత ప్రయత్నించినా బుజ్జి గున్న పైకి రాలేకపోయింది. తన బిడ్డను రక్షించుకునేందుకు తల్లి ఏనుగు తొండంతో, రెండు కాళ్ళతో లాగుతూ, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
చివరికి ఆ తల్లీ బిడ్డల కష్టాన్ని ఏనుగుల మందలోని మరో గజరాజు గమనించింది. సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి పరుగున వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న పెద్ద ఏనుగుతోపాటు రెండు ఏనుగులూ కలసి తొండాలను చుట్టి ఎట్టకేలకు చిన్నారి ఏనుగును బురద నుంచి సురక్షితంగా బయటకు లాగాయి. క్రుగేర్ పార్క్ లో కనిపించిన ఈ దృశ్యం... ఇప్పుడు సంఘటిత శక్తి సత్ఫలితాలనిస్తుందన్న మాటను నిరూపిస్తోంది. తల్లి ప్రేమనూ ప్రత్యక్షంగా ప్రతిబింబించింది.