'పుచ్చ' పేలిపోయింది
న్యూయార్క్: ఇద్దరు రిపోర్టర్లు చేసిన చిలిపి సరదా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. రబ్బరు బ్యాండ్లతో పుచ్చకాయను వారు పేల్చి వేసిన తీరు ఫేస్ బుక్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు.
అనుకుందే తడవుగా తెల్లని వస్త్రాలు నిండుగా ధరించి ఒక పుచ్చకాయను తెచ్చి టేబుల్పై పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 రబ్బర్లు బ్యాండ్లు ఒకదాని తర్వాత మరకొకటి వేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తొలుత చూసినవారు కాస్తంతా ఓపిక కోల్పోయి చిరాకుగా కనిపించారు. ఆ తర్వాత సరిగ్గా 500 రబ్బరు బ్యాండ్లు దాటిన తర్వాత బూమ్ అని ఒక్కసారిగా పుచ్చకాయ పేలిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.