తప్పించుకోవడానికి వేరే మార్గం లేక..
తప్పించుకోవడానికి వేరే మార్గం లేక..
Published Wed, May 25 2016 8:58 PM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM
మాస్కో: తాము నివాసముంటున్న అపార్టుమెంటు ఫ్లాటులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అక్కడి నుంచి కిందకు దూకితే కానీ బతికి బట్టకట్టే అవకాశం లేదని ఇంటికి పెద్ద కుటుంబసభ్యులకు తేల్చి చెప్పాడు. వారిలో గుండె సమస్యతో బాధపడుతున్న 11 నెలల చిన్నారి కూడా ఉంది. బాల్కని చివరన నిలుచొని కొద్దిసేపు సహాయం కోసం ఎదురు చూసినా ఎలాంటి సహకారం అందలేదు. దారిన పోయే వారు ఆ ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించి సమయస్పూర్తితో ఆలోచించి, సమిష్టిగా వారిని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నదే తడవుగా దాదాపు 20 మంది వరకు ఒకే చోట చేరారు. బాధితులను పైనుంచి దూకాల్సిందిగా గట్టిగా అరిచారు. ఓ వైపు దట్టమైన పొగ, కమ్ముకొస్తున్నమంటలు చేసేదేమీ లేక దేవున్ని ప్రార్థిస్తు ఒక్కొక్కరుగా కిందకు దూకడం మొదలు పెట్టారు. ఎక్కడ కింద ఉన్న వారి చేతిలో వారు పడకుండా పడిపోతారేమో అని చూసేవారంతా నరాలు తెగే ఉత్కంఠతో చూస్తూనే ఉండిపోయారు. రష్యాలోని మాస్కో సమీపంలోని స్ట్రునినోలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మొదట ఆ కుటుంబంలోని చిన్నారి జెన్యూని(11 నెలలు) ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరడంతో అక్కడే ఉన్న వారు బ్లాంకెట్లో పట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబంలోని మరో చిన్నారిని కూడా కిందకు విసిరారు. తమ ఇద్దరు పిల్లలు క్షేమంగా కిందకు చేరిన తర్వాత తల్లి ఎలినా కూడా బాల్కని నుంచి కిందకు దూకింది. ఇక చివరగా తండ్రి విటలీ వంతు వచ్చింది.బాల్కని చివరి అంచుల్లో నిలుచొని ఒక్కసారిగా ఆకాశంలోకి చూసి దేవుడా నువ్వే దిక్కు అనుకొని దూకాడు.
చివరకు కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆ దుర్ఘటన నుంచి బయటపడటంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ, మంటలతో కుటుంబ పెద్ద విటలీకి స్వల్ప గాయాలవ్వడంతో ఆతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement