వేస్ట్ చేస్తే.. వేసేస్తారు! | fine for food wastage, says UNO | Sakshi
Sakshi News home page

వేస్ట్ చేస్తే.. వేసేస్తారు!

Published Fri, Nov 13 2015 2:35 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

వేస్ట్ చేస్తే.. వేసేస్తారు! - Sakshi

వేస్ట్ చేస్తే.. వేసేస్తారు!

‘తింటున్న దాని కంటే వృథా చేస్తున్నదే ఎక్కువ...’ ఆహారం విషయంలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్య ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ వృథా అవుతున్న ఆహార పరిమాణం గురించి లెక్కగట్టిన ఆ సంస్థ ప్రతి ఏటా 13 లక్షల టన్నుల ఆహార పదార్థాలు మట్టిపాలు అవుతున్నాయని తేల్చింది. విందులు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో, ఇళ్లల్లో, హోటళ్లలో వృథా అవుతున్న ఆహార పరిమాణం ఇది. ఈ నేపథ్యంలో తమ వంతుగా ఇలాంటి వృథాను అరికట్టడానికి జర్మనీ చేస్తున్న ఒక ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది.     - సాక్షి సెంట్రల్ డెస్క్
 
 ఆహారాన్ని వృథా చేస్తే ఫైన్
 జర్మన్ రెస్టారెంట్లలో అమలవుతున్న చట్టం
 వేస్ట్ చేస్తే బిల్లు కన్నా పెరిగిపోయే ఫైన్
 కిరాణా స్టోర్లలో పదార్థాలపై కన్నేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం
 వృథా అరికట్టడానికి కఠినమైన చట్టాలు
 అభినందనలు అందుకుంటున్న వృథా నివారణ యత్నాలు

 
 కందిపప్పు కష్టాలు.. కస్టమర్లపై ఫైన్!
 మనదేశంలోనూ ఫైన్ వేస్తామంటూ వృథా ను నివారించే ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ముంబైలోని ఒక ఉడిపి హోటల్ వాళ్లు తమ హోటల్‌లో సాంబార్‌ను వృథా చేసే వాళ్లపై ఫైన్ వేస్తున్నారు. ఇడ్లీ తిన్న తర్వాత ఒక్కబొట్టు సాంబార్ కూడా మిగల్చకూడదక్కడ. మిగిలితే పది రూపాయల వరకూ ఫైన్ వేస్తున్నారు. సాంబార్ మిగలకూడదన్న నియమాన్ని కస్టమర్లకు ముందుగానే వివరించి అక్కడ ఇడ్లీ వడ్డిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు వ్యవహారం వేరే ఉంది. కందిపప్పు ధర ఆకాశానికంటడంతో సాంబార్ తయారీ ఖర్చు పెరగడంతో ఆ హోటల్ ఈ ఫైన్ నిబంధన పెట్టిందంతే!
 
 రెస్టారెంట్ రూల్ ఇది...
 ‘మీకు కావాల్సినంత తినండి. కొసరి కొసరి వడ్డిస్తాం. కానీ తిన్నాక  కంచంలో మెతుకు మిగలకూడదు’ అనేది జర్మనీ దేశంలోని రెస్టారెంట్లలో ఉన్న నియమం. ప్రభుత్వం చట్టంగా చేసిన ఈ నియమాన్ని అక్కడి రెస్టారెంట్ ఓనర్లు కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు దారికి వచ్చారు. తిన్నంత తిని, పడేసినంత పడేసే దగ్గర నుంచి.. సరదాగా హోటల్‌కు వెళ్లినప్పుడు కూడా కొంచెం కొంచెం ఆర్డర్ ఇచ్చుకునే దశకు వచ్చారు.
 
 బిల్లు కన్నా ఫైనే ఎక్కువ!
 ఒక రెస్టారెంట్ లేదా హోటల్‌లో ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే అక్కడున్న వేరే వాళ్లు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఆఖరికి కోక్, ఎనర్జీ డ్రింకులను అయినా ఖాళీ చేయకుండా అలాగే వదిలేస్తే ఫైన్ పడుతుంది. కనీస వడ్డన 50 యూరోల వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని మరోరకంగా చూస్తే... స్నేహి తులతోనో, బంధువులతోనో కలసి భోజనం చేస్తే అయ్యే బిల్లు కన్నా.. ఎక్కువ. అందుకే ఇప్పుడు జర్మన్ రెస్టారెంట్లలో, హోటళ్లకు వెళ్లిన వాళ్లు చాలా పరిమితంగానే ఆర్డర్లు ఇవ్వడాన్ని అలవాటు చేసుకున్నారు. అవ సరం అయితే మారు వడ్డనకు ఆర్డర్ ఇచ్చు కోవచ్చు.. వృథా చేయకుండా బయటికి వస్తే చాలనేది ఇప్పుడు అక్కడి ప్రజల భావన.
 
 ఫ్రాన్స్‌లో షాపుల వాళ్లపై...
 ప్రజలపై కాదు కానీ, కిరాణా సరుకులను అమ్మే గ్రోసరీ షాపుల వాళ్లపై దృష్టి పెట్టింది ఫ్రెంచి ప్రభుత్వం. ఒక ప్రణాళిక లేకుండా సరుకులను షాపుకు తెప్పించుకుని వాటి ఎక్స్‌పైరీ డేట్ దాటే వరకూ షాపులో ఉంచుకుని.. చివరకు వాటిని మట్టిపాలు చేయడానికి వీలులేదక్కడ. కాలపరిమితి దాటిపోయి వృథా అవుతాయనుకున్న ఆహారపదార్థాలను వీలైనంత ముందుగా ఏ అనాథాశ్రమాలకో డొనేట్ చేయాలి కానీ.. వృథా చేస్తే మాత్రం షాపు యజమానులకు భారీ ఫైన్‌లు, జైలు శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ విధంగా ఆహార వృథాను అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 అమెరికాలో కూడా...
 ఆహారాన్ని వృథా చేయడంలో తొలి వర సలో, తొలిస్థానంలో ఉన్నారు అమెరికన్లు. అక్కడ కూడా రెస్టారెంట్లలో, హోటళ్లలో వృథా చేసే వారిపై ఫైన్ వేయాలనే ప్రతి పాదన ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో మాత్రమే అది అమలవుతోంది. ఇక మనదేశం విషయానికి వస్తే... భారతీయులు కూడా తమ వంతుగా ఏటా 58 వేల కోట్ల రూపాయల విలువచేసే ఆహారాన్ని చెత్తకుండీల పాల్జేస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, విందుల సమయాల్లోనే ఎక్కువ ఆహారం వృథా అవుతోంది. మరి వృథాను అరికట్టడానికి ప్రభుత్వం ఫైన్లే వేయనక్కర్లేదు. వృథా చేయరాదనే స్పృహ ఉంటే చాలు కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement