అయితే హోటల్స్ లో తినకండి..!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆర్డర్స్ పై ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జ్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఏఐ) స్పందించింది. ప్రభుత్వం ప్రకటను విభేదించిన సంఘం సర్వీస్ చార్జ్ చెల్లించే ఉద్దేశం లేకపోతే హెటల్స్ లో తినొద్దంటూ ఒక ప్రకటన జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్ విధింపును పూర్తిగా సమర్ధించుకున్న ఎన్ఆర్ఏఐ సర్వీసు చార్జ్ ను ఐచ్ఛికం చేసే బదులు ప్రభుత్వం పన్నులు వదులుకోవాలని వ్యాఖ్యానించింది.
చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు ఎన్ ఆర్ ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తమ వాదన మద్దతుగా రియాజ్ ఉదహరించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు. అలాగే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే సర్వీస్ ఛార్జ్ చెల్లింపులపై వినియోగదారులకు మర్యాదగా వివరిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మను చంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు.
కాగా సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది వినియోగదారులే నిర్ణయించుకుంటారని చెప్పిన కేంద్రం.. అది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తేల్చి చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.