
ఇస్లామాబాద్ : తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాకిస్తాన్ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల ద్వారా తమ ప్రాంతంలోని 19 చెట్లను భారత పైలట్లు ధ్వంసం చేశారని పాక్ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మెరుపు దాడుల గురించి ప్రస్తావించిన పాక్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్ మాట్లాడుతూ... ‘ పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ. అక్కడ(బాలాకోట్)లో డజన్ల కొద్దీ పైన్ చెట్లు నేలకూలాయి. మేమెంతో నష్టపోయాం. ఈ విషయమై చర్యలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్ పరువు తీయొచ్చనే కుట్రలు పన్నుతోంది. కాగా బాలకోట్‌లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు హతమయ్యాయా లేదా చెట్లు కూలాయా అంటూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌తో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment