లండన్: తమ దేశ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులకు అణు, జీవ, రసాయన యుద్ధాలకు సంబంధించిన విద్యను బోధించబోమని బ్రిటన్ వర్సిటీలు ప్రకటించాయి.
లండన్: తమ దేశ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులకు అణు, జీవ, రసాయన యుద్ధాలకు సంబంధించిన విద్యను బోధించబోమని బ్రిటన్ వర్సిటీలు ప్రకటించాయి. ఆ కోర్సులు చదివేందుకు విదేశీ విద్యార్థులకు అనుమతి కూడా ఇవ్వకూడదని నిర్ణయించాయి. ఇప్పటికే ఈ కోర్సుల్లో ఉన్న దాదాపు 739 మంది విద్యార్థులను వాటిని చదవకుండా నిషేధించాయి. దేశ రక్షణ సంబంధమైన ఆందోళనల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు సదరు కోర్సుల్లో పరిజ్ఞానం సంపాధించుకొని అనంతరం ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు సూచించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి.
మానవ విధ్వంసం సృష్టించగల అణ్వాయుధాల తయారీని నేర్పించే సైన్స్ కోర్సుల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తూ 2007లో ఒక పాలసీని తీసుకొచ్చారు. అయితే, వీటిల్లో స్వదేశీ కన్నా విదేశీ విద్యార్థులే ఎక్కువగా చేరుతున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అణుపదార్ధాలు, జీవసంబంధ పదార్థాలు, రసాయన పదార్థాలతో చేసే ఆయుధాల తయారీ విజ్ఞానాన్ని విదేశీయులకు నేర్పించబోమని ప్రకటించింది.