లండన్: ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలోనూ, అలంకరణ కోసమేకాక ఇంట్లో వెలుతురు నింపేందుకు గాజు పదార్థాన్నివినియోగించడం ఇప్పటి దాకా చూస్తున్నాం. అలా అమర్చిన గ్లాస్ పగిలి పోకుండా ఎంతో సున్నితంగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడిక ఆ భయం లేదంటున్నారు పరిశోధకులు. గృహ నిర్మాణాల్లో గోడలకు, కిటికీలకు వాడే అద్దానికి బదులుగా గాజును పోలి ఉండే పారదర్శకమైన చెక్కను అందుబాటులోకి తెస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు ఇక ఇంట్లో వెలుతురుతోపాటు, అందాన్ని తెచ్చుకునేందుకు గాజుకంటే బలమైన చెక్కను వాడి డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు.
ఇంటి గోడల గుండా కాంతి ప్రసరించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేందుకు గృహ నిర్మాణంలో అద్దాలను వాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే స్థానంలో ఎంతో ధృఢంగా ఉండి.. గాజులాంటి పారదర్శకంగా ఉండే చెక్కను వాడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ పదార్థాన్ని సోలార్ సెల్ విండోగా కూడ వినియోగించవచ్చని బయోమాక్రోమోలెక్యూల్స్ జర్నల్ లో వివరించారు. నిజానికి ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకునేందుకు, విద్యుత్తును ఆదా చేసేందుకు లేత రంగు అద్దాలను పైకప్పులకు అమర్చుకోవడం, దీపాలను ఆశ్రయించడం చేస్తుంటారు. అయితే ఈ పారదర్శకంగా ఉండే చెక్క తో అటువంటి సమస్యను తీర్చవచ్చని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు.
ముఖ్యంగా గోడలు పారదర్శకంగా ఉంటే కృత్రిమ వెలుగుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఇప్పటికే చెక్కనుంచి పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తుండగా, ప్రస్తుత పరిశోధనల్లో అదే కాగితాన్ని ధృఢంగా, బలమైన పదార్థంగా తయారు చేయడం సాధ్యమని కనుగొన్నారు. స్వీడన్ లోని స్టాకోట్ కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బెర్గ్ లండ్, అతడి సహచరులు జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.
ఇందుకోసం ముందుగా వాణిజ్య బాల్సా చెక్క నమూనాలనుంచి పరిశోధకులు లైనిన్ తొలగించారు. సాధారణంగా మొక్కల్లో ఉండే లైనిన్ చెక్కనుంచి కాంతిని ప్రసరించకుండా చేస్తుంది. అయితే దీన్ని తొలగించడం వల్ల పూర్తి శాతం పారదర్శకత చేకూరదు. అందుకే చెక్కనుంచీ నేరుగా కాంతి లోపలకు ప్రసరించేందుకు వీలుగా యాక్రిలిక్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు రెట్లు బలమైన గాజులాంటి చెక్క తయారవుతుందని చెప్తున్నారు.