
వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో సముద్రమట్టాలు గణనీయంగా పెరుగుతాయని.. తీర ప్రాంతాల్లోని మహా నగరాలు సగానికిపైగా నీటమునిగిపోతాయని తరచూ వార్తలొస్తున్నాయి. అకాల వర్షాలు, వరదల తీరు చూస్తూంటే ఈ పరిణామాలు నిజమయ్యే సూచనలే ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్కిటెక్ట్‌లు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నారు. నేలను వదిలి.. సముద్రాలపైనే జీవించాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి భవనాలు కట్టాలి? వాటిల్లో ఎలాంటి సౌకర్యాలుండాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. వాటిల్లో ఒకటి పక్క ఫొటోలోని వర్టికల్ సిటీ. మధ్యప్రాచ్య దేశాల్లో ఇలాంటి ఒక భవన నిర్మాణానికి ఇటలీకి చెందిన ఓ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేస్తోంది. మునిగిపోతాయనుకునే మహానగరాలకు సమీపంలోనే సముద్రగర్భాన్నే పునాదిగా చేసుకుని నిర్మాణమవుతాయి ఈ నిట్టనిలువు నగరాలు!
మొత్తం 180 అంతస్తులు.. 2460 అడుగుల ఎత్తు ఉండే వీటిల్లో ఇళ్లు, ఆఫీసులు, విందు, వినోదాలన్నింటికీ ఏర్పాట్లు ఉంటాయి. మొత్తం 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణముండే ఈ భవనంలో గాలి, వెలుతురుతోపాటు పచ్చదనానికీ పెద్దపీట వేశారు. భవనం చుట్టూ ఉండే అద్దాల్లోనే సూర్యరశ్మిని ఒడిసిపట్టగల సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. సముద్రగర్భాన్నే పునాదిగా చేసుకుంటున్నారు కాబట్టి.. కింద కొన్ని అంతస్తుల భవనం నీటిలోనే ఉంటుంది. వీటన్నింటినీ వాహనాల పార్కింగ్, భవనానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు వాడతారు. వీటితోపాటు ఈ ప్రాంతంలోనే కొన్ని పారదర్శకమైన హోటల్ గదులూ ఉంటాయి. వీటిల్లోంచి సముద్రపు అడుగున జీవించే జలచరాలను గమనించవచ్చునన్నమాట. నీటిలోంచి, గాల్లోంచి కూడా ఈ భవనంలోకి ప్రవేశించేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. భవనం పై అంతస్తులో హెలీప్యాడ్, నీటిలోంచి వచ్చేందుకు పడవలను వాడతారు. ఐడియా బాగుంది కానీ ఎప్పటికి వాస్తవ రూపం దాలుస్తుందన్నదే నో ఐడియా!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్