గే జంటకు కేక్ నిరాకరణ:రూ. 85లక్షల జరిమానా
లాస్ ఏంజిల్స్:గత రెండు సంవత్సరాల క్రితం ఓ స్వలింగ సంపర్క జంటకు పెళ్లి కేక్ ఇవ్వడానికి నిరాకరించినందుకు బేకరీ యజమానికి లక్షా ముప్పైదు వేల డాలర్లు(రూ. 85 లక్షలు) జరిమానా విధిస్తూ తాజాగా ఆరిగాన్ లేబర్ కమిషన్ తీర్పునిచ్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 2013 లో పెళ్లి కేక్ తీసుకుందామని గ్రీషమ్ లోని మెలీస్సా బేకరీకి రిచెల్ మరియు లారెల్ బోమన్ అనే స్వలింగ సంపర్క జంట వచ్చారు. అయితే వారికి అక్కడ నిరాశే ఎదురైంది. పెళ్లి కేక్ ను ఇవ్వడానికి యజమాని నిరాకరించాడు. స్వలింగ సంపర్క వివాహాలకు తమ మత సంప్రదాయాలు ఒప్పుకోవని బేకరీ యజమాని క్లెయిన్స్ అందుకు విముఖత వ్యక్తం చేశాడు.
దీనిపై ఆ జంట లేబర్ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ అంశంపై గురువారం లేబర్ కమిషనర్ బ్రాడ్ తుది తీర్పును వెలువరించారు. ఆ జంట అడిగిన పెళ్లి కేక్ ను నిరాకరించింనందుకు లక్షా ముప్ఫై ఐదు వేల డాలర్లు వారికి పరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆ యజమాని ప్రస్తుతం బేకరీని మూసివేయడం గమనార్హం.
గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది.