జనరల్‌ ఆదేశాలతో చైనా దుస్సాహసం | With General Orders China Planning For India Border | Sakshi
Sakshi News home page

జనరల్‌ ఆదేశాలతో చైనా దుస్సాహసం

Published Wed, Jun 24 2020 4:09 AM | Last Updated on Wed, Jun 24 2020 4:09 AM

With General Orders China Planning For India Border - Sakshi

వాషింగ్టన్‌: చైనా మిలటరీ జనరల్‌ ఆదేశాలతోనే భారతీయ సైనికులపై గల్వాన్‌లో చైనా సైనికులు దాడి చేశారని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్‌తో గతంలో జరిగిన కొన్ని సరిహద్దు ఘర్షణలను పర్యవేక్షించిన చైనా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌కు అధిపతి జనరల్‌ ఝావ్‌ జోంగ్‌కీ గల్వాన్‌ దాడికి అనుమతులిచ్చారని నిఘా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా దాని మద్దతుదారు భారత్‌ దోపిడీ నుంచి తప్పించుకోవాలంటే చైనా బలహీనంగా కనిపించకూడదని ఝవ్‌ గతంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. గల్వాన్‌లో భారత జవాన్లపై దాడి ఘటన భారత్‌కు ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో జరిగిందేనని విశ్లేషకుల అంచనా.

గల్వాన్‌  ఘర్షణలు అదుపు తప్పిన ఘటనకాదని, ముందస్తు ప్రణాళికతో చైనా చేపట్టిన ప్రాజెక్ట్‌గా చూడాలని భారత్‌కు తన సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజింగ్‌ ఈ దుస్సాహసానికి పాల్పడిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్‌ ప్రతిఘటనతో చైనా లక్ష్యం నెరవేరకపోగా వారికే ఎదురుదెబ్బ తగలింది. చైనీయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ని పెంచింది. సరిహద్దు వివాదాలపై భవిష్యత్తు లో భారత్‌తో చర్చలు జరిపే పరిస్థితి లేదు. వాణిజ్యం విషయంలో తన శత్రువు అమెరి కాకు భారత్‌ మరింత దగ్గరయ్యేందుకు ఈ ఘటన కారణమవుతోందని చైనా భావిస్తోంది.

భారత్‌పై అమెరికా ఒత్తిడి..
గల్వాన్‌ ఘటన అసలు ఉద్దేశం భారత భూభాగంపై పట్టు సాధించడం కాకపోవచ్చు. ఎందుకంటే చైనా కంపెనీలకు ముకుతాడు వేయాల్సిందిగా అమెరికా కొన్ని నెలలుగా భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఫైవ్‌జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు హువాయి సాయం తీసుకోవాలని భారత్‌ భావించడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. గల్వాన్‌ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులపై భారత్‌లో వ్యతిరేకత పెరగడం అమెరికా ఆశించిందే. ఈ ఘటనలన్నీ చైనా ఆశలకు వ్యతిరేకంగా జరుగుతున్నవేనని గల్వాన్‌ ఘటన చైనాకు విజయమేమీ కాదని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే గల్వాన్‌ నిర్ణయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాత్ర ఏమిటనేది స్పష్టంకాలేదు. సైన్యాధికారి ఆదేశాల విషయం జిన్‌పింగ్‌కు ముందే తెల్సి ఉంటుందని చైనా సైన్యం పనితీరు తెలిసిన కొందరు అంచనావేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement