సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్ 'టిక్ టాక్'కు మరో షాక్ తగిలింది. ఇటీవల మద్రాస్ హైకోర్టు బ్యాన్, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్ టాక్ యాప్‌ను గూగుల్ బ్యాన్ చేసిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. టిక్‌టాక్ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టిక్ టాక్ యాప్ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్ టాక్ అందుబాటులో లేదు. అయితే యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. తాజా పరిణామంపై గూగుల్, యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఏప్రిల్ 3నాటి మద్రాస్ కోర్టుతీర్పును సవాల్ చేస్తూ బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థను సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కింది కోర్టు తీర్పును సమర్ధించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తదుపరి విచారణను ఈ నెల( ఏప్రిల్) 22కి వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని చెప్తూనే గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ వాడకంలో ఉండడం వల్ల నష్టాలేంటో లిఖిత వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‍ను తొలగించాలని పేర్కొంది.
చైనా ఆధారిత యాప్ అయిన టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలన్న అభ్యర్థన సమర్దించిన మద్రాస్ హైకోర్టు యాప్‌పై నిషేధాన్ని విధించింది. అలాగే గూగుల్, ఆపిల్ స్టోర్లలో ప్రమాదకరమైన యాప్‌ను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్, హలో యాప్‌లు దేశవ్యాప్తంగా టీనేజర్‌లు, యువతపై దుష్ర్పభావాన్ని చూపిస్తున్నయని పేర్కొంది. దీనికి అనుకూలంగానే సుప్రీం కూడా తీర్పునివ్వడంతో గూగుల్ ఈ చర్యకు తీసుకున్నట్టు సమాచారం.
కాగా కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నయాప్‌లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. సెన్సార్ టవర్ ఫిబ్రవరిలో అందించిన సమాచారం ప్రకారం ఇదిభారతదేశంలో 240 మిలియన్లకంటే ఎక్కువసార్లు డౌన్‌లోడ్ అయింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమంది వినియోగదారులు 2019 జనవరిలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారట. గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 12 రెట్లు ఎక్కువ. అంతేకాదు భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను నియమించుకున్న సంస్థ తన వ్యాపారాన్ని విస్తరణకు ఎక్కువ పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరోవైపు ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో దీనిపై పూర్తి నిషేధం అమల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment