
శాన్‌ఫ్రాన్సిస్కో: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అమెరికా సైన్యంతో చేసుకున్న ఓ ఒప్పందం నుంచి వైదొలగనుంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గూగుల్ ఉద్యోగులు నిరసన తెలపడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రాజెక్ట్ మావెన్’అనే ప్రాజెక్టు కోసం అమెరికా సైన్యం గూగుల్‌తో జతకట్టింది. డ్రోన్లు తీసే వీడియోల్లో ఉన్నది మనుషులా లేక వస్తువులా అనేదాన్ని గుర్తించేందుకు మానవ ప్రమేయం లేకుండా కృత్రిమ మేధస్సును వాడటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యుద్ధ సంబంధ ప్రాజెక్టులను గూగుల్ చేపట్టకూడదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘మనుషులు, వస్తువుల మధ్య తేడాలను కృత్రిమ మేధస్సు గుర్తిస్తే, మానవ ప్రమేయం లేకుండా మనుషులను డ్రోన్లే యుద్ధంలో హతమార్చే రోజు రావొచ్చు. అది చాలా ప్రమాదకరం. దీనిపై అంతర్జాతీయంగా విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని ఐసీఆర్‌ఏసీ అనే సంస్థ పేర్కొంది. ఉద్యోగుల నిరసనతో గూగుల్ దిగొచ్చింది.