చికెన్ కోసం ట్వీట్ చేస్తే గిన్నిస్ రికార్డొచ్చింది!
ఫ్రీగా చికెన్ తినాలనే కోరికతో ఓ కుర్రాడు చేసిన ట్వీట్లు ఏకంగా గిన్నిస్ రికార్డునే బద్దలుకొట్టాయి. అమెరికాలో ఫేమస్ అయిన చికెన్ నగ్గట్స్ అంటే కార్టర్ విల్కర్సన్‌కు చచ్చేంత ఇష్టం. అయితే ఏడాదిపాటు వాటిని ఉచితంగా తినాలంటే ఏం చేయాలంటూ ఓ రెస్టారెంట్‌కు ట్వీటర్ సందేశాన్ని పంపాడు. దీంతో ’నీకు చికెన్ అంటే అంతగా ఇష్టమనే విషయాన్ని మేం అంగీకరించాలంటే నువ్వు కనీసం 18 మిలియన్ల సార్లు ట్వీట్లు చేయాలి’ అని చెప్పారు. దీంతో వెంటనే ఆ పనిని మొదలుపెట్టిన కార్టర్.. సదరు రెస్టారెంట్ తరఫున చికెన్ నగ్గట్స్ గురించి ప్రచారం చేయడం, ఎదుటివారి నుంచి వచ్చిన ట్వీటర్ సందేశాలకు రీట్వీట్ చేయడం మొదలుపెట్టాడు.
ఇలా తనకు తెలియకుండానే 34,30,500 ట్వీటర్ సందేశాలకు తిరిగి సమాధానమిచ్చాడు. అయితే ప్రపంచంలో ట్వీటర్ సందేశాలకు ఇన్నిసార్లు సమాధానమిచ్చినవారు (రీట్వీట్లు చేసినవారు) ఇంకెవరూ లేరట. ఇప్పటిదాకా ఈ రికార్డు డీజెనరస్ వ్యక్తి పేరిట ఉండగా.. కార్టర్ దానిని అధిగమించాడు. చికెన్ మీద వల్లమాలిన ఆశతో ఇప్పటికీ రీట్వీట్లు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక తాను గిన్నిస్ రికార్డును సాధించానని తెలుసుకున్న కార్టర్ ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దాని ద్వారా టీషర్టులు విక్రయిస్తూ వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెబుతున్నాడు.