
కాల్పుల సంఘటనతో భయకంపితులైన ఇరుగుపొరుగువారు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న దృశ్యం
హ్యూస్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి కన్నబిడ్డలనే కడతేర్చాడు. మొత్తం ఆరుగురుని హత్య చేశాడు. ఇంట్లోనే ఉన్న తన నలుగురు చిన్న పిల్లలతోపాటు మరో ఇద్దరిని తుపాకీతో కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఉత్తర హ్యూస్టన్ నగరం శివార్లలో బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. హత్యకు గురైనవారిలో 4, 14 సంవత్సరాల ఇద్దరు బాలురు, 7,9 సంవత్సరాల ఇద్దరు బాలికలు, 33 ఏళ్ల మహిళ, 39 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నారు.
ఉన్మాది కాల్పులలో తీవ్రంగా గాయపడిన వారు సమాచారం తెలియజేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతమందిని హత్య చేసిన తరువాత అతను పోలీసులకు మూడు గంటలపాటు ముప్పుతిప్పలుపెట్టాడు. చివరకు అతనే లొంగిపోయాడు. అయితే హంతకుడి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. భార్యాభర్తల మధ్య గొడవే ఇంతమంది హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.