బ్రెజిల్ లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపి కాల్పుల్లో పద్దెనిమిది మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని ముఖ్యనగరం సావోపోలో శుక్రవారం రాత్రి ఈ భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి.
సావోపోలో: బ్రెజిల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సావోపో నగరంలో శుక్రవారం రాత్రి ఈ భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన కొంతమంది దుండగులు ... వివిధ ప్రాంతాల్లో వరుసగా ఈ కాల్పులకు తెగబడ్డారు. ఓ వాహనంలో వచ్చిన వీరంతా.... అక్కడున్న వారిని వివరాలు అడిగి మరీ కాల్చి చంపినట్టు తెలుస్తోంది.
ఒసాస్కో బారౌరీ ప్రాంతాల్లో ఈ కాల్పులు సంభవించాయి. అక్కడ ఉన్న ఓ బార్లోకి చొరబడ్డ ఆగంతకులు ..అక్కడవారిని కాల్చి చంపారు. సీసీ టీవీల్లో ఈ దృశ్యాలు రికార్డు కాగా, ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్నిపోలీసులకు వివరించారు. ఈ మధ్య కాలంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇది చాలా దారుణమైన ఘటన అని మృతుల సంఖ్య కూడా ఎక్కువేనని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. అత్యున్నత స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు.
ఇంతమందిని కాల్చి చంపిన ఘటన ఇంతకుముందెప్పుడూ తాను చూడలేదని ఫోరెన్సిక్ నిపుణులు మీడియాకు తెలిపారు. కాగా బ్రెజిల్ నగరం రియోడెజెనిరోలో చుట్టూ ఉన్న పేదల బస్తీల్లో ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడూ జరగడం అక్కడ సర్వసాధారణం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతూ ఉంటాయని బీబీసి రిపోర్ట్ చేసింది.