గుండె లేకుండా ఏడాదికి పైగా బతికేశాడు!
గోపీచంద్ హీరోగా చేసిన ఒక్కడున్నాడు సినిమా గుర్తుందా. అందులో విలన్ మహేష్ మంజ్రేకర్‌కు గుండెలో సమస్య ఉండటంతో బయట ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకుని దాంతోనే బతికేస్తుంటాడు. అతడికి గుండెమార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే, గుండె లేకుండానే బతికేశాడన్న మాట. అమెరికాలో ఓ పాతికేళ్ల కుర్రాడు నిజంగా ఇలాగే గుండె లేకుండానే ఏడాదికి పైగానే బతికేశాడట!! అవును.. భుజాలకు వెనకాల తగిలించుకునే బ్యాగ్ ప్యాక్ లాంటి సంచిలో కృత్రిమ గుండె పెట్టుకుని, 555 రోజుల పాటు అతడు ఉన్నాడు. ఆ కృత్రిమ గుండె అన్నిరోజుల పాటు రక్తాన్ని పంపింగ్ చేస్తూ అతడిని సజీవంగా ఉంచింది. ఎట్టకేలకు ఇటీవల అతడికి గుండె ఇవ్వడానికి ఒక దాత దొరకడంతో.. గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేసి, ఆ పరికరాన్ని తీసేశారు.
అతడి పేరు స్టాన్ లార్కిన్. 2014 సంవత్సరంలో అతడికి మిచిగన్ రాష్ట్రంలో ఈ కృత్రిమ గుండెను అమర్చారు. దాని పేరు 'సిన్‌కార్డియా'. స్టాన్ లార్కిన్‌తో పాటు అతడి అన్న డోమ్నిక్‌కు కూడా కార్డియోమయోపతి అనే గుండె సమస్య ఉంది. దానివల్ల గుండె ఏ క్షణంలో అయినా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఏళ్ల తరబడి దాతల కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సోదరులిద్దరూ సిన్‌కార్డియా అనే కృత్రిమ గుండెను అమర్చుకున్నారు. ఇద్దరిలో డోమ్నిక్‌కు త్వరగానే గుండె దాత దొరికారు. కానీ స్టాన్ మాత్రం చాలాకాలం పాటు వేచి ఉండాల్సి వచ్చింది. దాంతో కృత్రిమగుండెను ఒక బ్యాగ్ ప్యాక్‌లో అమర్చి, దాన్ని అతడికి తగిలించారు. దాని బరువు దాదాపు 6 కిలోలు. 24 గంటలూ అది వెంట ఉండాల్సిందే. లేకపోతే స్టాన్ బతకడు. అలాంటి పరిస్థితిలో కూడా అతడు బాస్కెట్‌బాల్ ఆడుతూ వైద్యులను ఆశ్చర్యపరిచాడు. ఎట్టకేలకు మే 9వ తేదీన అతడికి గుండెమార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.