
‘అగ్ర’పీఠానికి పోటీ పడేదెవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి వేడెక్కుతోంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న
సొంత పార్టీ నేతల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న హిల్లరీ, ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి వేడెక్కుతోంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లకు సొంత పార్టీ నేతల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. అయోవా రాష్ట్రంలో ట్రంప్, హిల్లరీలు తమ ప్రత్యర్థుల కంటే స్వల్ప ముందంజలో ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ట్రంప్‌కు 28 శాతం మంది మద్దతు పలకగా.. అదే పార్టీకి చెందిన సెనెటర్ టెడ్ క్రజ్‌కు 23 శాతం దన్నుగా నిలిచినట్టు స్థానిక పత్రిక డెస్ మొనీస్ తెలిపింది. ఈ మేరకు తాజాగా సర్వే ఫలితాలను ప్రకటించింది.
ఇదే రాష్ట్రంలో జనవరి 13న వెల్లడించిన పోల్ సర్వేలో ట్రంప్ కన్నా క్రజ్ ముందంజలో కనిపించారు. ఆ పోల్‌లో ట్రంప్‌కు 22 శాతం మంది మద్దతు పలకగా.. క్రజ్ వైపు 25 శాతం మంది మొగ్గారు. తాజా పోల్‌లో మాత్రం ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నట్టు డెస్ మొనీస్ పేర్కొంది. ఇక అభ్యర్థిత్వం కోసం హిల్లరీతో పోటీ పడుతున్న మరో డెమోక్రటిక్ నేత బెర్నీ సాండర్స్ ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయోవాలో తాజాగా నిర్వహించిన పోల్ సర్వేలో హిల్లరీకి 45 శాతం మంది మద్దతు పలకగా.. బెర్నీకి 42 శాతం మంది దన్నుగా నిలిచారు. ‘డెమోక్రటిక్ పార్టీలో అభ్యర్థిత్వ పోరు నువ్వా.. నేనా..? అన్నట్టు నడుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే బెర్నీ సాండర్స్, క్లింటన్ మధ్య టై ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని ఎన్నికల విశ్లేషకుడు డేవిడ్ అక్సెల్‌రాడ్ తెలిపారు. కాగా, సోమవారం నుంచి వివిధ రాష్ట్రాల్లో ప్రైమరీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలుత అయోవా రాష్ట్రం నుంచే వెల్లడయ్యే ఈ ఫలితాలు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను నిర్ణయించనున్నాయి.