లండన్: ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నా, చాలామంది వివిధ సాకులతో వారి మాటలను పెడచెవిన పెడుతుంటారు. ఇలాంటి బద్ధకస్తుల కోసం 'మానసిక ఉత్ప్రేరకాలు' సూచిస్తున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఆధునిక సమాజంలో శారీరక శ్రమ తగ్గడం అనేక రుగ్మతలకు కారణమౌతోంది. దీంతో బద్ధకస్తులు, అధిక బరువుతో బాధపడుతున్నవారు వ్యాయామానికి తమను తాము సన్నద్ధం చేసుకోవడానికి స్వల్ప మోతాదులో మానసిక ఉత్ప్రేరకాలు ఉపయోగకరంగా ఉంటాయని కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇప్పటివరకు సాధారణంగా నికోటిన్కు బానిసలైన వారిలో పరివర్తన కోసం వైద్యులు ఈ తరహా సూచనలు చేస్తుంటారు. కానీ స్థూలకాయులు, బద్దకస్తుల కోసం కూడా మానసిక ఉత్ప్రేరకాలను సూచించడం తప్పుకాదంటున్నారు. ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో లేజీనెస్, స్థూలకాయం చాలా ముఖ్యమైనవనీ వీటిని తగ్గించడానికి మానసిక ఉత్ప్రేరకాలు వాడటం తప్పులేదని ఇది మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరణాల సంఖ్య రెట్టింపవుతుందని, దీనికి సైకో ఫార్మకలాజికల్ చికిత్సా విధానం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.