పిల్లలను పావులుగా మార్చుకుంటున్న ఐసిస్
అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఐసిస్ వికృత చర్యలకు పాల్పడుతోంది. టెర్రరిస్టులు గత నెల్లో విడుదల చేసిన ప్రాపగాండ చిత్రాల్లోని దృశ్యాలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. బాల సైనికులను చేర్చుకొని మారణాయుధాలుగా వాడుతున్న తీరు... తీవ్రవాదుల దాష్టీకాన్ని కళ్ళకు కడుతున్నాయి. మోకాళ్ళపై కూర్చొని తండ్రి చేతిని ముద్దాడుతున్న పదకొండేళ్ళ 'అబు ఇమారా అల్ ఒమారి' ఫొటో.. ఐసిస్ ప్రాపగాండలో భాగంగా గతనెల్లో విడుదలైంది. అయితే ఒమారి ఒక్కడే కాదు... టెర్రరిస్టుల వలలో బాలసైనికులు వేలమంది ఉన్నారంటూ తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
ట్రక్కు నిండుగా పేలుడు పదార్థాలతో బయలుదేరే ముందు ఒమారి.. తండ్రినుంచి తీసుకున్న చివరి వీడ్కోలు.. భవిష్యత్ తరాలను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం 18 ఏళ్ళ లోపు పిల్లలను సైనికులుగా చేర్చుకునే అవకాశం లేదు. ఒకవేళ తగ్గ సాంకేతిక ప్రయోజనాలను చూపించి చేర్చుకున్నా వారిని యుద్ధానికి వినియోగించకూడదు. అటువంటిది ఐసిస్ ఆ నిబంధనలేవీ అనుసరించడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా బాలలను సైనికులుగా రిక్రూట్ చేసుకొని, వారికి రహస్యంగా శిక్షణ ఇచ్చి... వారిని మారణాయుధాలుగా వాడుకుంటోందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇస్లామిక్ దాడుల్లో స్వయం ప్రతిపత్తి కనిపించడంపై అధ్యయనకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సర కాలంలో ఐసిస్ లో సైనికులుగా చేరిన సుమారు 88 మంది పిల్లులు మరణించినట్లు తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఐసిస్ ఛైల్డ్ ప్రాపగాండ డేటాబేస్ ఆధారంగా చేపట్టిన సర్వేల్లో ఈ ముఖ్య విషయాలు వెల్లడయ్యాయి. వీడియోలు, ఫొటోలతో జనాన్ని భయపెట్టడానికి మాత్రమే తీవ్రవాదులు పిల్లలను వాడుకోవడం లేదని, వారి కార్యాచరణకు పావులుగా వాడుతున్నారని రచయిత చార్లీ వింటర్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇదే కొనసాగితే మున్ముందు పూర్తిగా భద్రత లేని పరిస్థితి కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 18 ఏళ్ళ లోపు పిల్లల వయస్సులు, తేదీలు, జాతీయతలపై జార్జియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఐసిస్ ఛానెల్స్, ట్వట్టర్, టెలిగ్రామ్ ల ఆధారంగా వివరాలను రికార్డు చేశారు.
ఈ వివరాలను బట్టి చూస్తే భవిష్యత్తు మరింత ప్రమాదాన్ని సూచిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఐసిస్ నుంచి తప్పించుకొని తిరిగి సాధారణ జీవితంలో అడుగు పెట్టినవారి గణాంకాలు చూసినా భవిత ప్రమాదకరంగానే కనిపిస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఉగ్రమూకల నుంచి తప్పించుకున్నవారిలో ఎక్కువశాతం పిల్లలు సిరియాకు చెందిన వారు ఉన్నారని, మరణించినవారు మాత్రం ఇరాక్ కు చెందినవారేనని అధ్యయనకారులు అంటున్నారు. తాము చేపట్టిన సర్వేల్లో ఐసిస్ ఎత్తుగడలు ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు.
ఐసిస్ లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లులే స్వయంగా సిద్ధమవడం కనిపిస్తోందని మరో రచయిత మియాబ్లూమ్ వెల్లడించారు. పిల్లలు కిడ్నాప్ కు గురి కావడం లేదని, తప్పిపోవడం లేదని కేవలం ఐసిస్ ప్రేరణతో తల్లిదండ్రులే వారిని స్వయంగా.. బాల సైనికుల పేరున పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు వారి తరువాతి తరాన్ని పెంచేందుకు జిహాదీలు కబ్స్ ఆఫ్ ది కాల్ఫేట్ పేరున రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఇంగ్లీష్ పత్రిక దబిక్ ప్రచురించింది. తల్లిదండ్రులు ఇస్లామిక్ స్టేట్ కోసం వారి పిల్లలను త్యాగం చేస్తున్నారని కూడా అందులో తెలిపింది.
అయితే బాల సైనికులను భవిష్యత్తుకు వాడటం లేదని, వారికి శిక్షణ ఇచ్చి వెంటనే యుద్ధరంగంలోకి దింపడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో 89 మంది మరణించగా, సుమారు 1500 మంది బాల సైనికులు జిహాదీ భావజాలంతో శిక్షణ పొంది, తమ సవాళ్ళను విసురుతూ పునరావాసంలో ఉన్నారని రచయిత బ్లూమ్ అంచనా వేస్తున్నారు. మతాన్ని వక్రీకరిస్తూ చిన్నారులను రిక్రూట్ చేసుకొంటున్న ఐసిస్ ను ఎదుర్కోవడం ప్రస్తుతం ప్రపంచానికే పెద్ద సవాల్ గా మారిందని పరిశోధకులు చెప్తున్నారు.