
ప్రణయయాత్ర హనీమూన్.. తమ జీవితమంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని పెళ్లైన ప్రతి జంట కోరుకుంటోంది. వందేళ్లు కలిసుండటానికి వేసే తొలి అడుగుల్లో మధురానుభూతులు నింపుకోవడానికి హనీమూన్ వేదిక కావాలని కోరుకుంటుంది. కానీ ఓ జంటకు హనీమూన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పెళ్లయిన ఏడు రోజులకే విడిపోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. హనీమూన్‌లో శృంగారానికి భార్య నిరాకరించిందని ఓ వ్యక్తి ఏకంగా కోర్టుకు ఎక్కాడు. పెళ్లయి.. పట్టుమని పదిరోజులు గడవకముందే భార్య నుంచి విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటన గల్ఫ్ దేశమైన యూఏఈలో జరిగింది.
దుబాయ్‌కి చెందిన ఓ జంట పెళ్లయిన వెంటనే హనీమూన్ కోసం యూరప్ వెళ్లారు. అయితే, అక్కడ అంతా అనుకున్నట్టు సజావుగా జరగలేదు. కొత్త జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో హనీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. హనీమూన్‌లో భార్య శృంగారంలో తనకు సహకరించలేదని, విడాకులు ఇప్పించాలని కోరాడు. అటు అతని భార్య కూడా విడాకాలు కావాలని కోరింది. భర్త వట్టి పిసినారి అని, తన కోసం అసలు డబ్బు ఏమాత్రం ఖర్చుపెట్టలేదని, అందుకే విడాకాలు ఇచ్చేయాలని కోరింది. వీరికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవటంతో అధికారులు షరియా కోర్టుకు ఈ కేసును అప్పగించారు. ఒక వేళ వీరికి కోర్టు విడాకులు మంజూరు చేస్తే.. అతి తక్కువ కాలం కలిసి జీవించిన వారిగా నిలిచిపోతారు.