పార్కులు, మాల్స్, రెస్టారెంట్లు, రీసార్ట్‌లు ఇలా ఎక్కడకు వెళ్లినా ముందుగా ఐస్‌క్రీమ్‌లకు ఆర్డర్ ఇవ్వాల్సిందే! ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందట.
లండన్: పార్కులు, మాల్స్, రెస్టారెంట్లు, రీసార్ట్‌లు ఇలా ఎక్కడకు వెళ్లినా ముందుగా ఐస్‌క్రీమ్‌లకు ఆర్డర్ ఇవ్వాల్సిందే! ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందట. ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయట. ప్రజల్లో ఆరోగ్యంపట్ల అవగాహన పెరగడమే అందుకు కారణమట. ముఖ్యంగా షుగర్‌ను తగ్గించాలన్న స్పృహ మరీ పెరిగి ఈ వ్యాపారాన్ని దెబ్బతీస్తోందట. 2015 సంవత్సరంతో పోలిస్తే 2016 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ అమ్మకాలు ఏకంగా 260 కోట్ల లీటర్లు పడిపోయాయని సమాచారం. ఈ విషయాన్ని మింటెల్ కంపెనీ ‘గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్’ అనలిస్ట్ అలెక్స్ బెకెట్ తెలియజేశారు.
2015 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1560 కోట్ల లీటర్ల ఐస్‌క్రీమ్ అమ్మకాలు జరగ్గా, 2016 సంవత్సరానికి ఆ అమ్మకాలు 1300 కోట్ల లీటర్లకు పడిపోయాయి. ప్రపంచంలో చైనా దేశం అత్యధికంగా ఐస్‌క్రీమ్‌లు ఉత్పత్తి చేస్తుంటే, ప్రపంచంలో నార్వే దేశస్తులు వాటిని ఎక్కువగా తింటున్నారు. నార్వేలో చలికాలం ఉష్ణోగ్రత మైనస్ ఆరు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోంది.
అయినా అక్కడి ఓ మనిషి ఏడాదికి 9.8 లీటర్ల ఐస్‌క్రీమ్ తింటారట. ఇప్పుడు ఇటలీలో ఐస్‌క్రీమ్ తినడాన్ని 29 శాతం మంది ప్రజలు వదిలి పెట్టారని తెలుస్తోంది. అయినప్పటికీ భారత్, ఇండోనేషియా, వియత్నాం దేశాల్లో ఐస్‌క్రీమ్ వినియోగం బాగా పెరిగిందని సమాచారం. వచ్చే ఏడాదికన్నా బ్రిటన్ అమ్మకాలను భారత్ అధిగమిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడమే కాకుండా ఐస్‌క్రీమ్ ధరలు పెరగడం, మంచి ఐస్‌క్రీమ్‌లను తినాలన్న ఆసక్తి పెరగడం కూడా ఐస్‌క్రీమ్ అమ్మకాలు పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.