బీజింగ్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ చైనాను ఆర్థికంగా కూడా దెబ్బతీస్తోంది. చైనాలోని నగరాలతోపాటు ప్రపంచదేశాలకు కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆయా దేశాలు చైనాలో ఉన్న తమ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. పలు విమానయాన సంస్థలు చైనా విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ స్వీడన్ కు చెందిన ఐకియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని తన 30 దుకాణాలలో సగం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరించిన వుహాన్ నగరంలోని దుకాణాన్ని ఇప్పటికే మూసి వేసింది.
వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించేందుకు సహకరించాలన్న చైనా ప్రభుత్వం పిలుపునకు ప్రతిస్పందనగా జనవరి 29 నుండి చైనాలోని సగం దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత ఉద్యోగులు తదుపరి నోటీసు వచ్చేవరకు విధులకు హాజరు కానవసరం లేదని ఇంట్లోనే వుంటారని తెలిపింది. కాగా చైనాలో సుమారు 14,000 మందికి ఉపాధి కల్పిస్తోంది ఐకియా. గత నెలలో బైటపడిన చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయినవారి సంఖ్య బుధవారం నాటికి 132కు పెరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment